- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

తెలుగు చిత్ర పరిశ్రమలో 'స్టార్ పవర్' అనే పదానికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఒక అగ్ర హీరో వెండితెరపై కనిపిస్తే చాలు, కథతో సంబంధం లేకుండా కాసుల వర్షం కురుస్తుందని నిర్మాతలు నమ్మే కాలం ఒకటి ఉండేది. కానీ, 2025 బాక్సాఫీస్ ట్రెండ్స్ పరిశీలిస్తే, ఈ సమీకరణం పూర్తిగా మారిపోయిందని అర్థమవుతోంది. కేవలం స్టార్‌డమ్‌ని నమ్ముకుంటే సరిపోదని, కంటెంట్ ఉంటేనే బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కగలమని 2025 స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది.


2025లో భారీ అంచనాలు - చేదు నిజాలు :
ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన పలు భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలు ప్రారంభంలో భారీ బజ్ క్రియేట్ చేసినప్పటికీ, ఓపెనింగ్స్ విషయంలో చతికిలబడ్డాయి. ఈ హీరోలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ వారు ఎంచుకున్న కథనం లేదా ఆ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ సాధారణ ప్రేక్షకులను థియేటర్ల వరకు రప్పించడంలో విఫలమైంది. ప్రస్తుత ప్రేక్షకుడు చాలా తెలివిగా ఉంటున్నాడు. కేవలం హీరోని చూడటానికే థియేటర్ కు వెళ్లడం లేదు. ప్రమోషనల్ వీడియోలు, టీజర్లు చూసినప్పుడే ఆ సినిమాలో 'విషయం' ఉందో లేదో పసిగట్టేస్తున్నారు. కేవలం ఫ్యాన్స్ కోసం తీస్తే సరిపోదు: ఒక సినిమా క్లాసిక్ హిట్‌గా నిలవాలంటే కేవలం అభిమానులు చూస్తే సరిపోదు. సామాన్య ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవ్వాలి. ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకునేలా ఉండాలి.


ఓజీ వర్సెస్ హరిహర వీరమల్లు: దీనికి పవన్ కళ్యాణ్ సినిమాలే చక్కటి ఉదాహరణ. 2025లో విడుదలైన ‘ఓజీ’ చిత్రం తన ప్రమోషనల్ స్వాగ్‌తో రూ.140 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. కానీ అదే స్థాయిలో అంచనాలున్న ‘హరిహర వీరమల్లు’ మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయింది. కారణం.. ‘ఓజీ’ కంటెంట్ యూత్‌ను, న్యూట్రల్ ఆడియన్స్‌ను ఇన్స్టంట్‌గా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఒక సినిమా చూడటం అంటే ప్రేక్షకుడిపై ఆర్థిక భారం పెరుగుతోంది. టికెట్ రేట్ల పెంపు, మరోవైపు కొన్ని వారాల్లోనే ఓటీటీ లో సినిమా వచ్చేస్తుందనే భరోసా జనాన్ని థియేటర్లకు దూరం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం స్టార్ ఇమేజ్ ప్రేక్షకులను మూడు గంటల పాటు కూర్చోబెట్టలేదు.


మారకపోతే మునగడం ఖాయం :
2025 టాలీవుడ్‌కు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. “స్టార్‌డమ్ అనేది ప్రేక్షకులను థియేటర్ వరకు తీసుకువస్తుంది, కానీ కంటెంట్ మాత్రమే సినిమాను గట్టెక్కిస్తుంది.” ఇప్పటికైనా దర్శక, నిర్మాతలు కేవలం హీరోల ఇమేజ్‌ను నమ్ముకోకుండా, పటిష్టమైన స్క్రిప్టులపై దృష్టి పెట్టాలి. లేనిపక్షంలో ఎంతటి భారీ బడ్జెట్ చిత్రాలైనా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: