టాలీవుడ్‌లో మెగా అభిమానుల సందడి ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతోంది. గతంలో తమ అభిమాన హీరోల సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా, ముఖ్యంగా ‘హరిహర వీరమల్లు’ వంటి ప్రాజెక్టుల ఆలస్యంపై జరిగిన ట్రోలింగ్‌తో కొంత నిరాశకు గురైన అభిమానులకు ఇప్పుడు వరుస విజయాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 2025 ఆరంభంలోనే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ (OG) రు. 300 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది. ఈ విజయంతో గేరు మార్చిన మెగా ఫ్యాన్స్, ఇప్పుడు సంక్రాంతి కానుకగా విడుదలైన చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రానికి వస్తున్న భారీ స్పందనతో పండగ చేసుకుంటున్నారు. అన్నదమ్ములిద్దరూ తక్కువ వ్యవధిలోనే హిట్లు కొట్టడంతో మెగా కాంపౌండ్‌లో పండగ వాతావరణం నెలకొంది.


ఇప్పుడు అందరి కళ్లు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై ఉన్నాయి. మార్చి 27న విడుదల కాబోతున్న ఈ పీరియడ్ విలేజ్ డ్రామా కోసం దర్శకుడు బుచ్చిబాబు సానా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఏమాత్రం ఆలస్యం కాకుండా నిర్ణీత తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ పట్టుదలతో ఉంది. ‘టాక్సిక్’, ‘దురంధర్ 2’ వంటి భారీ సినిమాలు పోటీలో ఉన్నా... కథ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాట సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జనవరి 26న రెండో పాటను, ఫిబ్రవరిలో భారీ ఎత్తున టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.


‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న ఇన్‌సైడ్ టాక్ అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ గా ఉంటుందని, ఇంటర్వెల్ ఎపిసోడ్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సమాచారం. భావోద్వేగపూరితమైన సన్నివేశాల్లో చరణ్ పలికించిన హావభావాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. దీనికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన ఆల్బమ్ అందిస్తే, ఈ సినిమా హైప్ మరో స్థాయికి చేరుకోవడం ఖాయం. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఒక పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథతో వస్తుండటంతో అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా ఫ్యాన్స్ ఆనందమే కనిపిస్తోంది. పవర్ స్టార్, మెగాస్టార్ వరుసగా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించగా, ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టి ‘హ్యాట్రిక్’ పూర్తి చేయాలని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ‘పెద్ది’  కూడా హిట్ అయితే ఆ తర్వాత రాబోయే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మెగా మార్కెట్ మరో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి 2025-26 సంవత్సరాలు మెగా హీరోల హవాకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ మెగా సునామీ ఇంకెన్ని రికార్డులను తుడిచిపెడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: