ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ తన వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ సినిమాలో అరవింద్ స్వామీ పోషించిన స్టైలిష్ విలన్ పాత్ర ‘సిద్ధార్థ్ అభిమన్యు’ గురించి రాజశేఖర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.విలన్ అంటే కేవలం హీరోకు ఎదురుగా నిలబడి అరిచే వ్యక్తి కాదు, అతను తెలివైనవాడు, వ్యూహాత్మకంగా ఆలోచించే వ్యక్తి కావాలని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. హీరో ఎంత బలంగా ఉంటాడో, అతనికి ఎదురుగా నిలిచే ప్రతినాయకుడు కూడా అంతే స్థాయిలో మెదడు ఉపయోగించేవాడై ఉండాలి. అలా ఉంటేనే కథలో ఉత్కంఠ పెరుగుతుందని, ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘సిద్ధార్థ్ అభిమన్యు’ పాత్రలో కనిపించిన ఆ బుద్ధిమత్త, స్టైల్, కూల్‌నెస్ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు.
అంతేకాకుండా, ఆ పాత్రను తానే చేయాలని అప్పట్లో కోరుకున్నానని రాజశేఖర్ వెల్లడించారు. అవకాశం దక్కుతుందేమోనని ప్రయత్నించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల తనను ఎంపిక చేయలేదని తెలిపారు. తనను తీసుకుంటే పారితోషికం ఎక్కువవుతుందని, అరవింద స్వామి అయితే కొన్ని సన్నివేశాల్లో ఇప్పటికే ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకోవచ్చని భావించి ఉండొచ్చని ఆయన ఓపెన్‌గా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.రాజశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఒక సీనియర్ నటుడు తనకు నచ్చిన పాత్ర గురించి ఇంత స్పష్టంగా, నిర్మొహమాటంగా మాట్లాడటం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. భవిష్యత్తులో ఇలాంటి తెలివైన, బలమైన విలన్ పాత్రల్లో ఆయనను చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. తన అనుభవం, నటనా పటిమతో మరోసారి శక్తివంతమైన పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తారనే నమ్మకం సినీ అభిమానుల్లో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి