తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. మొన్నటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ మంచి మెజారిటీ సీట్లను సాధించింది. తాజాగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు సాధించి అదరహో అనిపించింది. అలా కాంగ్రెస్ మంచి ఫలితాలతో ముందుకు వెళుతున్న సమయంలో ప్రతిసారి అడ్డకాలు వేస్తూ తన వాదన వినిపిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తూ తన గళాన్ని వినిపిస్తున్నారు. తనకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని మీడియా ముందే మాట్లాడుతూ వస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా మంత్రి పదవి కావాలని కాంగ్రెస్ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారు. 2023 ఎలక్షన్స్ కు ముందు తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి బిజెపి నుంచి కాంగ్రెస్లోకి తీసుకువచ్చారని అన్నారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించారని తెలియజేశారు. 

అలాగే రెండవసారి మంత్రివర్గ విస్తరణలో కూడా తనకు అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ ఆ సమయంలో వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ లకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారని అన్నారు. ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నా కానీ తనకు అవకాశం ఇవ్వడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం నెక్స్ట్ టార్గెట్ సీఎం పదవే అని డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో కాంగ్రెస్ విజయం సాధించిన సందర్భంగా  ఆయన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఈ విషయాలను ప్రస్తావించారు. రాబోవు రోజుల్లో మునుగోడు ప్రజల ఆశీర్వాదంతోనే తనకు మంత్రి పదవి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం తనను గుర్తించకపోతే ఏకంగా ముఖ్యమంత్రినే అవుతానని, సీఎం రేవంత్ రెడ్డికి సాంకేతాలు పంపారు.

తాను మంత్రి పదవి అడిగేది ఏదో విలాసాలు అనుభవించడానికి కాదని అభివృద్ధి కోసమే అడుగుతున్నానని అన్నారు. నేను అనుకున్న పదవి ఇవ్వకపోతే మాత్రం  మీరంతా మునుగోడు చూసుకోండి నేను తెలంగాణను చూసుకుంటా అంటూ అక్కడ కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ పరువు తీసే విషయాలు ప్రస్తావిస్తున్నారు పలువురు మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ అధిష్టానం లో రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు ఎక్కువగా ఉన్నారని మరో మంత్రి పదవి ఇస్తే బీసీ ప్రజల్లో  వ్యతిరేక గళం వినిపిస్తుందని అంటున్నారు. ఇక ఇదే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తంకుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. మరో పదవి ఇస్తే ముగ్గురు అవుతారు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంలో కాస్త ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: