ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులు నెలకొంటున్నాయి.. వలసలు కూడా ఊపందుకున్నాయి. పార్టీలు మారే నాయకులు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు భైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కూడా అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి చేరిన విషయం విదితమే. తాజాగా.. మ రెండు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు రాంకుమార్‌రెడ్డి కూడా వైసీపీలో చేరుతుండడంతో ఆ పార్టీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆయన ఏ నియోజకవర్గం టికెట్ అయితే కోరుతున్నారో.. ఆనం రామనారాయణరెడ్డి కూడా అదే నియోజకవర్గం టికెట్ కోరుతూ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అనూహ్యంగా రాంకుమార్‌రెడ్డి ముందుకు రావడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని పలువురు నాయకులు అంటున్నారు. అసలు వీరిద్దరికీ వైసీపీ అధినేత జగన్ ఏ హామీ ఇచ్చారన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.

ఇక ఇదే సమయంలో ఈ పరిణామాలపై ఆనం రామనారాయణరెడ్డి కొంత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా తానే వెంకటగిరి టికెట్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఇద్దరు నేతలు కోరుతున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే నెల్లూరు రాజకీయాల్లో రాజకీయ ఉద్దండుడిగా ఆనం రామనారాయణ రెడ్డి గుర్తింపు పొందారు. చాలా కాలంగా ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే మొదట్లో ఆనంకు వెంకటగిరి సీటు కేటాయించేందుకు జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు రాంకుమార్‌రెడ్డి కూడా అదే సీటుపై కన్నేసి వైసీపీలో చేరుతుండడంతో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ వైసీపీలో ఎవరు ముందుగా చేరితే వారికే టికెట్ దక్కుతుందన్న ఆలోచనలో ఉన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంలో మరింత క్లారిటీ వస్తుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నారు.