సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఒకే రోజు పర్యటిస్తున్నారు. జహీరాబాద్ లో రాహులో సమరభేరి మోగించారు. టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్, బీజేపీలపై మండిపడ్డారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీని ఇక్కడి నుంచి గెలిపించారని.. వారందరికీ ధన్యవాదాలు అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ దేశానికి చౌకిదార్ గా ఉంటానంటూ ఊదరగొడ్తున్నారని.. అయితే అనిల్ అంబానీ, నీరవ్ మోదీలకు మాత్రమే ఆయన చౌకీదార్ అని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలోని 15 మంది ధనవంతులకు చౌకీదార్ గా మోదీ ఉన్నారన్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదన్నారు. నరేంద్ర మోదీని గద్దె దించడం ఒక్క కాంగ్రెస్ కే సాధ్యమన్నారు.

 

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 కోట్ల మంది నిరుపేద కుటుంబాలకు నెలక్ 6వేల రూపాయల చొప్పున ఏడాదికి 72 వేల రూపాయలను అందిస్తామని రాహుల్ ప్రకటించారు. ప్రధాని మోదీ పేదలపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని.. తాము మాత్రం పేదలకోసం స్ట్రైక్స్ చేస్తామన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, ఉద్యోగం, ఆరోగ్యరంగాల్లో మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

 

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మోదీకి మద్దతుగా ఉన్నారన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా రఫేల్ స్కామ్ పై మాట్లాడారా అని నిలదీశారు. కేసీఆర్, మోదీ ఇద్దరూ ఒక్కటేనన్నారు. నరేంద్ర మోదీ కూడా కాంగ్రెస్ ను మాత్రమే విమర్శిస్తున్నారని.. కేసీఆర్ ను విమర్శించట్లేదని ఆరోపించారు. అందరం కలిసి బీజేపీని, టీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే అది బీజేపీకే వెళ్తుందని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: