ఏపీలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన టీటీడీ బోర్డు చైర్మ‌న్ నియామ‌కం జ‌రిగి నెల రోజులు అవుతున్నా జ‌గ‌న్ ఇప్ప‌ట‌కీ బోర్డు స‌భ్యుల‌ను మాత్రం నియ‌మించ‌లేదు. టీటీడీ ఛైర్మన్ గా ఏవీ సుబ్బారెడ్డి నియామకం జరిగి నెలలు గడిచినా పాలకమండలి సభ్యుల నియామకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనిపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని తెలుస్తోంది.


గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఒంగోలు ఎంపీగా ఉన్న జ‌గ‌న్ బాబాయ్‌కు ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సీటు ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల్లో సీటు త్యాగం చేసినందుకు గాను జ‌గ‌న్ తాను సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే బాబాయ్ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించారు. దీంతో సుబ్బారెడ్డి హిందువు కాద‌ని.. క్రిస్టియ‌న్ అని విమ‌ర్శ‌లు వ‌చ్చినా జ‌గ‌న్ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌లేదు.


ఇక బోర్డు విష‌యానికి వ‌స్తే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వీరిలో జ‌గ‌న్ మ‌దిలో ఎవ‌రు ?  ఉన్నార‌న్న‌ది తెలియ‌క‌పోయినా కొన్ని పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. పాలక మండలిలో సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలకు కొందరికి ఛాన్స్ దక్కే అవకాశముంది. 


పార్టీలో సీనియ‌ర్లుగా ఉన్న వారిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు రాలేదు. ఈ నేప‌థ్యంలో వారికి ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి (తిరుప‌తి), ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి(కాకినాడ సిటీ), కన్నబాబు రాజు (య‌ల‌మంచిలి) లకు టీటీడీ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 


మహిళ సభ్యురాలిగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. ఇక తెలంగాణ కోటాలో ఇచ్చే మెంబ‌ర్ ప‌ద‌విని సీఎం కేసీఆర్ చెప్పిన వాళ్ల‌కు ఇస్తార‌ని అంటున్నారు. ఇక క‌ర్నాట‌క కోటాతో పాటు త‌మిళ‌నాడు కోటాలో కూడా ఒక‌రికి బోర్డు మెంబ‌ర్ ప‌ద‌విని ఇవ్వ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: