తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసైనికుల మధ్య మళ్ళీ రచ్చ మొదలైంది. అసలే ఓ వైపు పవన్‌ని దగ్గర చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తమ్ముళ్ళు , జనసైనికులతో కయ్యానికి దిగుతున్నారు. ఇటీవల కరోనా రోగులని ఆదుకునేందుకు తన ఛారిటీ ద్వారా చిరంజీవి ఆక్సిజన్ సిలిండర్లని అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంపై టీడీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. గతంలో బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్తం అమ్ముకున్నారని, ఇప్పుడు ఆక్సిజన్ అమ్ముకుంటున్నారని తమ్ముళ్ళు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులకు, జనసైనికులకు చిర్రెత్తికొచ్చి, టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. హెరిటేజ్ పెట్టి చంద్రబాబు ఎప్పుడైనా ఒక పాల ప్యాకెట్ పేదలకు ఉచితంగా ఇచ్చారా? అని మండిపడుతున్నారు. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో కూడా విమర్శలు చేస్తున్నారు. అక్కడ కూడా పేదలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం లేదని మాట్లాడుతున్నారు.
అయితే 2009 నుంచే టీడీపీ కార్యకర్తలకు, మెగా ఫ్యామిలీ అంటే కాస్త కోపం ఎక్కువ అని చెప్పొచ్చు. అప్పుడు ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ఓట్లు చీల్చి టీడీపీ ఓటమి కారణమయ్యారని తమ్ముళ్ళు ఫైర్ అవుతుంటారు. కానీ 2014లో పవన్, టీడీపీకి మద్ధతు ఇచ్చి గెలిపించారు. దీంతో తమ్ముళ్ళు కాస్త చల్లబడ్డారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేసి ఓట్లు చీల్చి, టీడీపీకి నష్టం చేశారు.
దీంతో తమ్ముళ్ళు మెగా ఫ్యామిలీపై ఎప్పుడు ఏదొకరకంగా విమర్శలు చేస్తుంటారు. అటు మెగా అభిమానులు, జనసైనికుల నుంచి కౌంటర్లు వస్తాయి. అయితే నెక్స్ట్ పవన్‌తో కలిస్తేనే టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో తమ్ముళ్ళు, జనసైనికులతో కయ్యం పెట్టుకుని కొంపముంచుతున్నట్లు కనిపిస్తోంది. ఇక బాబు కూడా పవన్‌ని దగ్గర చేసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకే అసలు పవన్‌పై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఆయనపై వైసీపీ విమర్శలు చేస్తే కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికైతే తమ్ముళ్ళు బాబుకి తిప్పలు తెచ్చేలా ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి