జగన్ కోరిక సీఎం కావడమే. దాని కోసం ఆయన పదేళ్ళుగా అలుపెరగని పోరాటం చేసి మొత్తం మీద సీఎం అయ్యారు. ఇక జగన్ తాను ముప్పయ్యేళ్ళ పాటు ఏపీ సీఎం గా ఉంటానని కూడా చెబుతూ వచ్చారు. ఆ దిశగా ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నారు కూడా. ముఖ్యంగా సమాజంలోని అన్ని వర్గాలను దగ్గర చేసుకోవడం ద్వారా పటిష్టమైన పునాది వేసుకుంటున్నారు.

నిజం చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జగన్ కి ఎదురు లేదు. విపక్షం కూడా బాగా వీక్ గా ఉంది. తెలుగుదేశానికి భవిష్యత్తు బెంగ ఉంటే బీజేపీ జనసేన వంటి పార్టీలు వైసీపీని ఢీ కొట్టాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. ఇదిలా ఉంటే జగన్ ఈ మధ్య జాతీయ రాజకీయాల్లోకి తరచూ చర్చకు వస్తున్నారు. ఆయన పరిపాలన మీద కూడా నేషనల్ మీడియాలో ఒక చర్చ సాగుతూంటే న్యాయ స్థానాలలో తరచూ ఏపీ సర్కార్ కి వ్యతిరేక తీర్పులు రావడం మీద  కూడా చర్చ ఉంది. ఇక రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు ఈ మధ్య వరకూ ఢిల్లీలో రచ్చ బండ మీటింగ్ పెట్టి మరీ జగన్ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. అవి కూడా నేషనల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. ఇపుడు ఆయన అరెస్ట్ కూడా హైలెట్ అయింది. ఆ మీదట సాగిన రచ్చ కూడా జాతీయ మీడియా దృష్టిని దాటిపోవడంలేదు.

ఇదిలా ఉంటే కరోనా రెండవ దశ తరువాత దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులు మోడీ మీద ద్వజమెత్తుతున్నారు. వారంతా కలసి కేంద్రం విధానాలను తప్పు పడుతున్నారు. అదే విధంగా వారు జగన్ మద్దతు కోరుతూ లేఖలు కూడా రాస్తున్నారు. ఇక తాజాగా జగన్ కూడా అందరు ముఖ్యమంత్రులు  వ్యాక్సిన్ మీద కేంద్ర విధానాల్లో మార్పు వచ్చేలా ఒకే గొంతుతో నిలబడాలని కోరుతూ లేఖ రాశారు. దీనికి ముందు ఆయన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కి కేంద్రానికి మద్దతుగా కరోనా వేళ నిలబడాలని సూచించారు.

ఇలా జగన్ జాతీయ రాజకీయాల్లో కొంత పాత్ర పోషిస్తున్నారు. జగన్ కి ప్రధాని కావాలన్న కోరిక ఉందని ఆ మధ్యన రెబెల్ ఎంపీ రఘురామ హాట్ కామెంట్స్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే 2024 ఎన్నికల తరువాత  ప్రాంతీయ పార్టీలే దేశంలో కీలకం అవుతాయన్న భావన ఉంది. ఇక ఒక వైపు ఎన్డీయే ఉంటే మరో వైపు యూపీయే ఉంది. ఇంకో వైపు మమతా బెనర్జీ లాంటి వారు ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు జగన్ లాంటి బలమైన నేత అవసరం అందరికీ ఉంది. దాంతోనే జగన్ కూడా కొంత క్రియాశీలం కావాలనుకుంటున్నారా అన్న చర్చ అయితే వైసీపీ లోపలా బయటా సాగుతోంది. అలాగని జగన్ ఇప్పటికిపుడు ఏపీని వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లరు. కానీ ఏపీ ప్రయోజనాలను కాపాడుకునేలా ఏదైనా కూటమి కి మద్దతుగా నిలుస్తారా అన్నదే ఇక్కడ ప్రశ్న‌. చూడాలి మరి ఏం జరుగుతుందో.

   



మరింత సమాచారం తెలుసుకోండి: