
కరోనా సమయంలోనూ చాలామంది ఉపాధ్యాయులు తమ సొంత ఆసక్తితో పల్లెటూర్లకు వెళ్లి మరీ పాఠాలు బోధించారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే పేద పిల్లలు కూడా అత్యున్నత ఉద్యోగాలు సంపాదిస్తున్నారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు వారి సేవలను కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా వారి సేవలను కొనియాడారు. భారత భావితరాల భవిష్యత్తు కోసం ఎంతో నిస్వార్ధంగా కృషి చేస్తున్న టీచర్లపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. టీచర్స్ డే పురస్కరించుకున్న తరువాత రామ్‌నాథ్ కోవింద్ గురువులకు విషెస్ తెలిపారు. విపత్తు సమయంలోనూ పాఠాలు బోధిస్తూ.. పిల్లలు చదువుపై ఆసక్తి కోల్పోకుండా ఎందరో ఉపాధ్యాయులు కృషి చేశారని ఆయన అభినందించారు.
‘‘మన దేశ సంప్రదాయంలో గురువులను దేవుడితో సమానంగా పూజిస్తారు. లాక్‌డౌన్ విధించిన అనంతరం ఆన్‌లైన్ వేదికగా స్టూడెంట్లకు పాఠ్యాంశాలు బోధించడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అయినప్పటికీ ఉపాధ్యాయులు ఎంతో కృషితో ఆన్‌లైన్ ద్వారా విద్యను అందించారు. పిల్లలకు ఇంటి నుంచే పాఠాలు బోధించేందుకు వారు ప్రతి సమస్యను అధిగమించారు. విద్యనందించడం లో ఎలాంటి అంతరాయం ఎదురవకుండా శక్తివంతమైన చర్యలు తీసుకున్నారు’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ టీచర్స్ డే నాడు గురువులను కొనియాడారు.