ఖాళీ కానున్న రాజ్యసభ లో ఎమ్మెల్సీ కవిత తో భర్తీ చేస్తారా? ఆ స్థానాన్ని మాజీ మంత్రి మండవ తో భర్తీ  చేస్తారా? నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజ్యసభకు ప్రమోట్ కానున్నారన్న సమాచారం జిల్లాలో జోరందుకుంది. ఎమ్మెల్సీగా ఆమె పదవీకాలం జనవరి తో ముగియనుండగా కవితను ఎంపీగా రాజ్యసభకు పంపుతారనే టాక్ గులాబీ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. బండ ప్రకాష్ ఎమ్మెల్సీ అయ్యాక రాజ్యసభ పదవిని వీడనుండటం, మరో రెండేళ్లకు పైగా గడువు ఉండడంతో ఆ పదవిని కవితతో భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కవిత నిర్ణయం కీలకంగా మారింది.

అయితే ఆమె స్థానిక సంస్థల కోటాలో మరోసారి ఎమ్మెల్సీ గా ఎన్నికై మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆమె అనుచరులు చెబుతున్నారు. రాజ్యసభ పదవి కోసం కవిత  ఆసక్తి చూపకుంటే సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మండవ పేరును పరిశీలించే అవకాశం ఉందనే ప్రచారం ఇందూరు పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. ఎమ్మెల్సీ కవిత నిర్ణయంపై తాజా మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న చర్చ జరుగుతోంది. కవిత రాజ్యసభకు వెళితే స్థానిక సంస్థల కోటాలో ఆకుల లలిత కు అవకాశం కల్పిస్తారట. ప్రస్తుతం మండలిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకపోవడంతో ఆకుల లలితకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందట. రాజ్యసభకు కవిత వెళ్లకపోతే ఆ స్థానం మండవ కు ఇస్తారట. ఇక జిల్లా నుంచి ఇప్పటికే రాజ్యసభలో కెఆర్.సురేష్ రెడ్డి, జి. శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 23 వరకు నామినేషన్ల దాఖలుకు తుదిగడువు, ఆ లోపు కవిత ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? రాజ్యసభకు ప్రమోట్ అవుతారా..?అన్నది తేలనుంది. కవిత నిర్ణయంపై ఆకుల లలిత రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉండడంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠగా మారింది. ఏమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన తనయ కవిత సేవలను ఎలా వినియోగించుకుంటారన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: