తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రంతో ధాన్యం కొనుగోలు విషయంపై పోరాడుతున్నారు. కేంద్రం తెలంగాణ ధాన్యం కొనట్లేదని.. కొనేవరకూ కేంద్రంతో యుద్ధం చేస్తామని పదే పదే అంటున్నారు. అయితే... ఈ ధాన్యం సమస్యకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ సింపుల్ పరిష్కారం చెబుతున్నారు. యాసంగి ధాన్యంలో నూకులు ఎక్కువగా వస్తాయి. అందుకే కేంద్రం కొనడం లేదన్నది బీజేపీ నేతల వాదన.. యాసంగిలో క్వింటాలు బియ్యంలో మరో 10 కిలోల నూకలు అధికంగా వస్తాయన్న ఈటల రాజేందర్‌.. బియ్యం ధర కిలో రూ.29 ఉంటే, నూకల ధర రూ.19 మాత్రమే పలుకుతోందని తెలిపారు. ఈ రెండింటికీ తేడా రూ.10 మాత్రమే.


అందుకే.. నూకలకు రూ.వెయ్యి కోట్లు పరిహారంగా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తే సమస్యే ఉండదని ఈటల రాజేందర్ చెబుతున్నారు. కేవలం వెయ్యి కోట్లు డబ్బూ భరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే  ఆ విషయాన్ని కేంద్రానికి చెప్పాలని సూచిస్తున్నారు ఈటల. పంజాబ్‌లో రెండో పంట వరి కాదు గోధుమలు పండిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గుర్తించాలని చెబుతున్నారు. తెలంగాణలో ధాన్యం కోనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి కేసీఆర్ దిగిపోవాలని ఈటల కామెంట్ చేశారు.


కానీ టీఆర్ఎస్‌ నేతలు మాత్రం ఈ విషయంపై కేంద్రాన్నే నిందిస్తున్నారు. తెలంగాణ రైతులను కేంద్రం మోసం చేస్తోందని నిందిస్తున్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పదేపదే అన్నదాతలను అవమానించేలా మాట్లాడుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు కూడా మండిపడుతున్నారు.  ఎప్పుడు చూసినా పీయూష్‌ గోయల్ బెదిరింపు ధోరణి, అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పీయూష్‌ గోయల్  బేషరతుగా ఆయన రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


తెలంగాణలో పండే యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని హరీశ్ రావు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ పురోగతిని చూసి కేంద్రం కళ్లల్లో నిప్పులు పోసుకుంటోందన్న హరీశ్ రావు.. రైతులను అవమానిస్తే సహించేది లేదంటున్నారు. అవసరమైతే నూకలు తినైనా.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని శపథం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: