వైసీపీ వాళ్ళు మొదటినుండి ఆరోపిస్తున్నట్లుగా అమరావతి డిమాండ్ తో జరుగుతున్న పాదయాత్ర అంతా బోగస్ అని తేలిపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రస్తుతం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంకు చేరుకుంది. పాదయాత్ర ఇక్కడ చేరుకునే సమయానికి హైకోర్టు ఒక ఆదేశమిచ్చింది. దానిప్రకారం యాత్రలో పాల్గొనేవాళ్ళంతా గుర్తింపుకార్డులు ధరించాలి, యాత్రలో 600 మంది మాత్రమే పాల్గొనాలి, కేవలం నాలుగు వాహనాలు మాత్రమే ఉండాలని ఆదేశాల్లో స్పష్టంగా ఉంది.





కోర్టుఆదేశాల్లో భాగంగా యాత్రలో పాల్గొంటున్న వాళ్ళని పోలీసులు నిలిపేశారు. గుర్తింపుకార్డులను చూపించమని అడిగారు. ఎప్పుడైతే పోలీసులు గుర్తింపుకార్డులు తనిఖీచేయటం మొదలుపెట్టారో చాలామంది యాత్రలో నుండి వెళ్ళిపోయారు. మొత్తంమీద పోలీసులు చేసిన తనిఖీల్లో అమరావతి ప్రాంతంవాళ్ళు కేవలం 75 మంది మాత్రమే అని తేలింది. మిగిలిన వాళ్ళంతా అమరావతితో ఏమాత్రం సంబంధంలేని వాళ్ళేనట.





అంటే పాదయాత్రలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వ్యాపారులు, వాళ్ళ తరపున ప్రతినిధులు, భూములు కొన్నవాళ్ళు ఉన్నట్లు తేలిపోయింది. ఇదే విషయాన్ని మంత్రులు, వైసీపీ నేతలు మొదటినుండి చెబుతునే ఉన్నారు. పాదయాత్రలో పాల్గొంటున్నవాళ్ళ ఆధార్ కార్డును చూపించమని అడిగితే చాలామంది అక్కడినుండి పారిపోయారట. పైగా పాదయాత్రకు వారంరోజులు బ్రేకిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించటం అనుమానంగా మారింది. తమనే అవమానిస్తారా అంటు కొందరు భోరుమంటున్నారు.  కోర్టు ఆదేశాల ప్రకారమే గుర్తింపుకార్డులు చూపించమని పోలీసులు అడిగితే పాదయాత్రకు వారంరోజులు ఎందుకు బ్రేకివ్వాలి ?





ఎందుకంటే ఈ వారంరోజుల్లో అమరావతి ప్రాంతంలో ఆధార్ కార్డులున్న కొందరిని పాదయాత్రలో పాల్గొనేందుకు వీలుగా రామచంద్రాపురం పిలిపించుకోవటానికే అని అర్ధమవుతోంది. పాదయాత్రలో పాల్గొంటున్న వాళ్ళల్లో భూములు కోల్పోయిన రైతులు చాలా తక్కువని అందరికీ తెలుసు. ఎందుకంటే టీడీపీ నేతలే రైతుల్లో చాలామంది దగ్గర నుండి భూములన్నీ కొనేశారని వైసీపీ మొదటినుండి ఆరోపిస్తోంది. ఇలా భూములు కొనేసి ధరలు పడిపోయాయన్న మంటతోనే చాలామంది తొడలు కొడుతు, ప్రభుత్వాన్ని రెచ్చగొడుతు నానా గోలచేస్తున్నారు. మొత్తంమీద వైసీపీ చెబుతున్నట్లుగా అమరావతి కోసం జరుగుతున్న పాదయాత్ర బోగస్ అని తేలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: