ప్రతిపక్షాలను జగన్మోహన్ రెడ్డి కావాలనే కెలికినట్లున్నారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సులో జగన్ మాట్లాడుతు తొందరలో రాజధాని కాబోయే విశాఖపట్నంకు పెట్టుబడిదారులందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తొందరలోనే విశాఖపట్నం రాజధాని కాబోతోందని, తాను కూడా రాబోయే నెలల్లో విశాఖకు మారబోతున్నట్లు ప్రకటించారు. జగన్ చెప్పిన మూడు మాటలతో  రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది.






తెలుగుదేశంపార్టీ, బీజేపీ, జనసేన, సీపీఐ నేతలు ఖండనల మీద ఖండనలు మొదలుపెట్టేశారు. టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ అయితే జగన్ పై రెచ్చిపోయారు. వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ నుండి జనాల దృష్టి మరల్చేందుకే రాజధాని అంశాన్ని ప్రస్తావించారంటు ఆరోపించారు. రాజధానిపై కోర్టులో విచారణ జరుగుతుండగా విశాఖే రాజధాని అని జగన్ ఎలా ప్రకటిస్తారంటు మండిపోయారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతు కోర్టు విచారణలో ఉన్న అంశంపై జగన్ ప్రకటించటమంటే కంటెప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందన్నారు.





ఇక బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీ జీవిఎల్ నరసింహారావు కూడా జగన్ పై రెచ్చిపోయారు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై జగన్ ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు విచారణను వెక్కిరిస్తున్నట్లుగానే ఉన్నాయని జీవిఎల్ అన్నారు. రాజధాని అంశంపై కోర్టు తీర్పు రాకుండానే విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్ పై కోర్టు థిక్కారం కేసు నమోదు చేయాలన్నట్లుగా వీర్రాజు డిమాండ్ చేశారు. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా జగన్ పై యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్ చేశారు.






అంతాబాగానే ఉందికానీ కోర్టు విచారణలో ఉన్న అంశంపై జగన్ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది అర్ధం కావటంలేదు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మాట్లాడకూడదన్న విషయం జగన్ కు తెలీకుండానే ఉంటుందా ? అన్నీ తెలిసే కావాలనే ప్రతిపక్షాలను జగన్ కెలికినట్లు అనిపిస్తోంది. ఇదే విషయమై ఎల్లోమీడియా కూడా జగన్ పై రెచ్చిపోతోంది.  ప్రతిపక్షాలను, ఎల్లోమీడియాను కావాలనే కెలకటంలో జగన్ ఆంతర్యం ఏమయ్యుంటుందో ?  


 





మరింత సమాచారం తెలుసుకోండి: