చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఆర్టీసీ జేఏసి కన్వీనర్  అశ్వత్ధామరెడ్డిని అరెస్టు చేశారు. కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ పై వెళ్ళటానికి ప్రయత్నించిన కన్వీనర్ ను  లిబర్టీ సెంటర్ దగ్గర అరెస్టు చేశారు.  ట్యాంకు బండ్ మీదకు కన్వీనర్ ఎటువైపు వస్తారో తెలీని పోలీసులు ముందుజాగ్రత్తగా రెండు మూడు వైపులా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 

అయితే సుమారు 10 గంటల ప్రాంతంలో లిబర్టి సెంటర్ నుండి ట్యాంక్ బండ్ మీదకు వెళ్ళటానికి ఇతర కార్మిక నేతలతో కలిసి అశ్వత్ధామ ప్రయత్నించారు. వెంటనే ఆ విషయాన్ని గ్రహించిన పోలీసులు అలర్టయి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయమే కో కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గుర్తు తెలీని ప్రాంతానికి తీసుకెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే.

 

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు తీవ్రంగా ప్రయత్నించాయి. అదే సమయంలో కార్యక్రమం విఫలమైందని చెప్పటంలో భాగంగా ప్రభుత్వం కూడా పెద్ద ప్రయత్నమే చేసింది. ఇందులో భాగంగానే వివిధ రాజకీయపార్టీలకు చెందిన నేతలను శుక్రవారం అర్ధరాత్రే హౌస్ అరెస్టులు చేసింది. కొందరిని పోలీసులు గుర్తుతెలీని ప్రాంతాలకు తరలించారు.

 

అదే సమయంలో శనివారం ఉదయం నుండి ట్యాంక్ బండ్ చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందుకనే ట్యాంక్ బండ్ మీద రాకపోకలను నిషేధించింది. మొత్తం ట్రాఫిక్ కు ప్రత్యామ్నయ మార్గాలను పోలీసులు సూచించటంతో జనాలు కూడా అందుకు సిద్ధమవటంతో మొత్తం ట్యాంక్ బండ్ రోడ్డంతా ఖాళీ అయిపోయింది.

 

నిజానికి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ కేసియార్ వైఖరిని వ్యతిరేకిస్తున్న వారంతా ట్యాంక్ బండ్ మీదకు చేరుకోవాలన్న అశ్వత్ధామరెడ్డి పిలుపు ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాల్సిందే. నిజానికి ఇప్పటికే కీలకమైన నేతల్లో చాలామందిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేసేశారు. కాబట్టి మిగిలిన ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ పార్టీల శ్రేణులకు దిశా నిర్దేశం చేసే అవకాశం లేకపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: