ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది?  ఫిరాయింపులకు మళ్లీ తెర లేవబోతోందా? ప్రతిపక్షపార్టీనే కాదు... అధికార పార్టీకీ ఆపరేషన్ ఆకర్ష్... షాక్ ఇవ్వబోతోందా? తర్వగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ పక్క పార్టీలపై కన్నేస్తోందా? అటు వైసీపీ, ఇటు టీడీపీలకు దడ పుట్టిస్తున్న బీజేపీది రియల్ అపరేషనా? లేక మైండ్ గేమా?  ఈ రెండు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న సుజనా చౌదరి ప్రకటనతో ఏపీ హీట్ పుట్టింది. సుజనా వ్యాఖ్యలపై అటు టీడీపీ, ఇటు వైసీపీ చేశాయి. 

 

ఏపీలో పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ముందు కనిపించే వేడి... ఎన్నికలు ముగిసిన ఆరు నెల్లకే మొదలైంది. వైసీపీ-టీడీపీలు విమర్శలు, ప్రతి విమర్శలతో నిత్యం దుమ్మెత్తిపోసుకుంటుంటే మధ్యలో బీజేపీ దీన్ని మరింత రక్తి కట్టిస్తోంది. ఈ రెండు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారన్న బీజేపీ ఎంపీ సుజనా వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్ష పార్టీలలో హీట్ పెంచేశాయి. ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి వలసలు వెళ్లడం మామూలే. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఒరవడి కనిపిస్తూనే ఉంది. ఏపీలో అధికారంలేని... ఒక్క శాతం ఓట్లు కూడా పొందలేని బీజేపీ.... అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లోఉన్నారని చెప్పడం అన్ని పార్టీలలో నిప్పు రాజేసింది. 

 

ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నుంచి ఇప్పటికే సుజనా, సీఎం రమేష్ తోపాటు మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గంటా శ్రీనివాసరావు ఆ పార్టీతో టచ్ లో ఉన్నారు. మరికొందరు కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సుజనా, సీఎం రమేషే పార్టీ మారడంతో మిగిలిన వారు కూడా అదే బాటలో ఉన్నారన్న విషయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.  అయితే టీడీపీ నుంచి ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సుజనా చెప్పడంతో అంతా షాక్ కు గురయ్యారు.

 


టీడీపీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న సుజనాతో చాలా మంది ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని అగ్రపథంలో నిలపాలని సుజనా అండ్ కోకు ఆ పార్టీ అధిష్టానం ముందే స్పష్టమైన టార్గెట్‌ పెట్టింది. అందుకే పార్టీలో చేరే నేతల కోసం వల విసురుతోంది సుజనా బృందం. మొన్నటి ఎన్నికల్లో 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో వల్లభనేని వంశీ పార్టీని వీడారు. గంటా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలింది  చంద్రబాబుసహా 21 మంది. వీరిలో 20 మంది బీజేపీలో టచ్ లోఉన్నారా? అన్నదే ఇప్పుడు సందేహం. అదే జరిగితే ఏపీ అసెంబ్లీలో టీడీపీ జాడలేకుండాపోతోంది. అంత పరిస్థితి వస్తుందా? చూడాలి. అయితే సుజనా వ్యాఖ్యలను టీడీపీ కొట్టిపారేస్తోంది. బీజేపీకి అంత సీన్ లేదని, ప్రధాని ప్రాపకం కోసమే సుజనా టచ్ ప్రకటనలు చేస్తున్నారని అంటోంది.


 
సుజనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే దాని వెనుక... ఖచ్చితమైన కారణం లేకపోదు అనే వారూ ఉన్నారు. ఇతర పార్టీల నేతలను ఒక్కొక్కరిగా కాక... ఒకేసారి ఆసక్తి ఉన్న మొత్తాన్ని పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతో బీజేపీ నాయకత్వం ఉంది. అందుకే కమల తీర్థం తీసుకునేందుకు గంటా రెఢీ గా ఉన్నా మిగిలిన వారి కోసం ఆపినట్టు సమాచారం. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లోఉన్నారని ప్రకటించారు సుజనా. 151 ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను గెలుచుకున్న వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెల్లు కూడా దాటలేదు. అంతలోనే ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడమా? ఇది నిజమా? అన్న సందేహం అందిరికి కలుగుతోంది. ఏపీలో అధికారంలో ఉన్న  పార్టీని వదిలి రాష్ట్రంలో ఉనికే లేని బీజేపీలో చేరాల్సిన అవసరం వైసీపీలో ఏ ఎంపికి, ఏ ఎమ్మెల్యేకి వచ్చిందన్న చర్చ జరుగుతోంది. అయితే సుజనా టీడీపీ ఏజంటంటూ వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ మారాల్సిన అవసరం మాకేంటని నిలదీశారు. ఢిల్లీలో సామూహికంగా మీడియా సమావేశం పెట్టిన వైసీపీ ఎంపీలు సుజనాపై విరుచుకుపడ్డారు.

 

ఏపీఐఐసీ చైర్మన్ రోజా కూడా సుజనాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసులకు భయపడి బీజేపీ నేతల కాళ్లు పట్టుకుని మరీ ఆ పార్టీలో చేరిన సుజనా... ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదంటూ ఫైర్ అయ్యారు. దేశంలో రెండోసారి అధికరాంలోకి వచ్చిన బీజేపీ ఏపీలో వేళ్లూనుకోడానికి ఇదే అదునుగా తహతహలాడుతోంది. అందు కోసం బీజేపీలో చేరేందుకు ముందుకొచ్చిన నేతలను వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటోంది. మరి సుజనా చెప్పినట్టు కమలానికి టచ్ లో ఉంది ఎవరు? వారు ఎప్పుడు ఆ పార్టీలో చేరతారు? ఆ సమయం ఎప్పుడు వస్తుందో... చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: