ఒక పక్క పార్టీ చరిత్రలో చూడని ఓటమి... మరో పక్క చంద్రబాబు తర్వాత పార్టీ భవిష్యత్తు ఏంటి ? రాజకీయంగా పార్టీ ఏ విధంగా ముందుకి వెళ్తుంది... ఆ పార్టీ లో అధినాయకత్వం నుంచి క్షేత్ర స్థాయి వరకు ఉన్న అభిప్రాయం ఇది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు విషయంలో భవిష్యత్తు ఉన్న యువనేతలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. క్యాడర్ కూడా నిలబడే పరిస్థితి ఇప్పుడు పార్టీలో కనపడటం లేదు. చంద్రబాబు ఎన్ని ఉత్సాహ భరిత ప్రసంగాలు చేసినా సరే క్యాడర్ లో మాత్రం జోష్ రావడం లేదు అనేది వాస్తవం.

 

ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పార్టీని వీడారు. ఆయన వైసీపీలోకి చేరడానికి సిద్దంగా ఉన్నారు. ఇది పూర్తి కాక ముందే ఇప్పుడు మరో తలనొప్పి తెలుగుదేశం పార్టీని వేధిస్తోంది. ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారు. ఆయన క్వారీలపై గత కొంత కాలంగా విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. దీనితో ఆయన పార్టీ మారడానికి సిద్దమవుతున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాతో పాటు పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి.

 

ఆయన ఇప్పటికే చంద్రబాబుని కలిసి విషయం చెప్పారని ఉండవల్లిలో చంద్రబాబుతో దాదాపు అరగంట సేపు గొట్టిపాటి భేటి అయి పరిస్థితి వివరించారట‌. చంద్రబాబు ఆయనకు ఇబ్బంది లేదని చెప్పినా, తాను స్వయంగా అండగా నిలుస్తాను అని చెప్పినా... గొట్టి పాటి మాత్రం టీడీపీలో ఉండ‌డానికి ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు.

 

ఇక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ని ఆయన ఒంగోలులో కలిసి పార్టీ మారే విషయమై చర్చలు కూడా జరిపారని... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ అద్దంకి నుంచి అవకాశం ఇస్తామని కూడా చెప్పినట్టు సమాచారం. ఏదేమైనా గొట్టిపాటి కూడా పార్టీ మారిపోతే అదే ఊపులో మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సైకిల్ దిగేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: