దిశ రేపిస్టులు ఎన్‌ కౌంటర్ తో మిగిలిన కేసులపైనా ఇదే న్యాయం జరగాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దిశను గత నెల 27 న నలుగురు కామాంధులు అతి దారుణంగా రేప్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే. పాశవికంగా బతికుండగానే పెట్రోల్ పోసి కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేశారు.

 

ఇంతలోనే దిశ రేపిస్టులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో అంతటా ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇదే తరహా న్యాయం మిగిలిన అత్యాచార ఘటనల బాధితులకూ జరగాలన్న డిమాండ్ లు వస్తున్నాయి. సరిగ్గా ఏడేళ్ల క్రితం దేశమంతా నివ్వెరపోయేలా జరిగిన నిర్భయ ఘటనలో ఇంత వరకూ న్యాయం జరగలేదు. దిశ రేపిస్టుల ఎన్ కౌంటర్ పై నిర్భయ తల్లి స్పందించారు.

 

హైదరాబాద్ పోలీసుల తీరుపై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. దిశ తల్లిదండ్రులకు కేవలం వారం రోజుల్లోనే న్యాయం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో తన కూతురికి ఇంకా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్ల నుంచి తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని.. న్యాయం కోసం పోరాడుతున్నానని ఆమె ఆవేదనగా చెప్పారు. దిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

 

అలాగే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఉన్నావ్ అత్యాచార ఘటన నిందితులనూ ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్ వస్తోంది. యూపీలోని ఈ జిల్లాలో పలు అత్యాచార ఘటనలు జరిగాయి. నిన్ననే దారుణాది దారుణంగా.. అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుంటే.. సజీవ దహనం చేసిన ఘటన దేశాన్నే నివ్వెరపరిచింది. ఈ ఘటనలో బాధితురాలు 90 శాతం కాలిపోయి నరకయాతన అనుభవిస్తోంది. మరి ఇలాంటి కేసుల్లోనూ నిందితులను ఎన్ కౌంటర్ చేసిపారేయ్యాలని జనం కోరుతున్నారు. మరి హైదరాబాద్ పోలీసులను ఈ పోలీసులు ఆదర్శంగా తీసుకుంటారా.. సత్వర న్యాయం చేస్తారా..అన్నది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: