జనసేన అధినేత పవన్ కల్యాణ్- బిజెపి ఢిల్లీ నాయకత్వం మధ్య ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అదే పనిగా ఢిల్లీకి ఫోన్ చేసి పిలిపించుకుని మరీ ఎందుకు అవమానిస్తున్నారో తెలీటం లేదు.  దాదాపు రెండున్నర రోజులు ఢిల్లీలోనే కాపు కాసినా పవన్ను కలవటానికి పార్టీ అగ్ర నేతలెవరూ ఇష్టపడలేదు. చివరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాను మాత్రం కలిసి ఫొటోలు తీసుకుని పరువు కాపాడుకుని తిరిగొచ్చేశారు.

 

మొన్న శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో నేతలు, కార్యకర్తలతో సమావేశంలో ఉన్నపుడు పవన్ ను ఓ ఫోన్ వచ్చింది. ఢిల్లీలిన బిజెపి అగ్రనేతల నుండి వచ్చిన ఫోన్ కావటంతో సమావేశం పక్కకు వెళ్ళి మాట్లాడారు. సరే ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలీదు కానీ వెంటనే సమావేశాన్ని ముగించేసుకుని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు.

 

తనతో పాటు నాదెండ్ల మనోహర్ ను కూడా తీసుకెళ్ళిన పవన్ ఢిల్లీలో ఏం చేశారయ్యా అంటే హోటల్ గదిలో కూర్చుని వేరుశెనక్కాయలు ఒలుచుకుని తిన్నారనే చెప్పాలి. అంటే అచ్చంగా వేరుశెనక్కాయలు ఒలుచుకున్నారని కాదు లేండి. ఉత్తినే హోటల్ గదిలోనే కూర్చుని కాలక్షేపం చేశారు.  అన్నీ పనులు వదులుకుని హుటాహుటిన ఢిల్లీకి వచ్చిన పవన్ ను ఏ ఉద్దేశ్యంతో పిలిపించారో మాత్రం అర్ధం కావటం లేదు ?

 

మరి పవన్ ను ఢిల్లీకి ఎవరు పిలిచారు ? ఎందుకు పిలిచారు ? అన్నది తెలియ లేదులేండి. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలవలేదు. అమిత్ షా నే కలవలేదంటే ఇక నరేంద్రమోడి సంగతి చెప్పేదేముంది ?  శనివారం అమిత్ , నడ్డాల్లో ఎవరూ కలవలేదు. ఆదివారమైనా కలుద్దామని అనుకుంటే అదీ సాగలేదు. చివరకు సోమవారం మధ్యాహ్నం జేపి నడ్డాను మాత్రం అతికష్టం మీద కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. మరి ఢిల్లీ ఎన్నికల్లో అంతగా బిజీగా ఉండేవారు అదే పనిగా పవన్ ను ఎందుకు పిలిపించుకున్నట్లు ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: