ఈ తతంగం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగినది. అక్కడ మంగళవారం నుంచి యూపీఎస్‌ఈబీ(బోర్డ్‌ ఎగ్జామ్స్‌) పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మావో జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం... తమ విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా సమావేశానికి ఆహ్వానించడం ఇక్కడ కొసమెరుపు. వారి సమక్షంలోనే సదరు ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌.. ఈ విధంగా మాట్లాడారు.. 

 

"చాలెంజ్‌ చేసి చెబుతున్నా.. నా విద్యార్థులు ఒక్కరు కూడా పరీక్షల్లో ఫెయిల్‌ అవ్వరు. ఎలాగైనా వారు పాసైపోతారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రశ్నకు సమాధానం తెలియకపోతే జవాబుపత్రంలో ఓ వంద రూపాయలు ఉంచండి" అంటూ.. విద్యావ్యవస్థ  తలదించుకునేలా మాట్లాడారు. ఈ యావత్ బాగోతాన్ని.. ఓ విద్యార్థి రహస్యంగా రికార్డు చేసి, అనంతరం గ్రీవెన్స్‌ సెల్‌లో వీడియోతో సహా ఫిర్యాదు చేశాడు. 

 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్‌ మాల్‌ను అరెస్టు చేశారు. కాగా యూపీలో మంగళవారం నుంచి ప్రారంభమైన బోర్డ్‌ ఎగ్జామ్స్‌(పది, పన్నెండో తరగతి)కు దాదాపు 56 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ ఏడాది మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు యోగి సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీలతో మానిటరింగ్‌ ఏర్పాటు చేయడంతో పాటుగా... సున్నితమైన ప్రాంతాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రత కూడా కల్పిస్తోంది. 

 

75 జిలాల్లలోని 7784 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ట్విటర్‌లో ఓ అకౌంట్‌ను క్రియేట్‌ చేసిన విషయం అందరికి తెలిసినదే.. ఇక యూపీలో గతంలో జరిగిన మాస్ కాపీయింగ్ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని... అక్కడ యోగి ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇటీవల యోగి ఒక ప్రసంగంలో విద్యార్థులనుద్దేశించి.. చూసి రాసి పాసవ్వడంకంటే.. నిజాయితీగా రాసి ఫెయిల్ అవ్వడం మేలు అని.. వారికి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: