భారత ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించింది. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 1,05,366 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 8 శాతం పురోగతి నమోదైనప్పటికీ.. ఆశించిన లక్ష్యాలను మాత్రం పన్ను వసూళ్లు అందుకోలేదు. ఫిబ్రవరిలో రూ.1.25 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ వరుసగా నాలుగో నెల లక్ష కోట్ల రూపాయలకుపైగా జీఎస్టీ వసూలు కావడం ఊరటనిచ్చే పరిణామం. రూ.1.05 లక్షల కోట్లలో కేంద్ర జీఎస్టీ రూ.20,569 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ రూ.27,348 కోట్లుగా ఉంది. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,10,828 కోట్లుగా నమోదయ్యాయి.

 

 

2019 ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరి నాటికి తెలంగాణ జీఎస్టీ వసూళ్లు ఆరు శాతం పెరగ్గా.. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు 23 శాతం పెరిగాయి. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు రూ. 3,460 కోట్లు ఉండగా.. ఏపీ వసూళ్లు రూ. 2,088 కోట్లు. గత ఏడాది జనవరితో పోలిస్తే.. ఈ ఏడాది జనవరికి తెలంగాణ జీఎస్టీ వసూళ్లు 19 శాతం పెరిగాయి. 2019 జనవరిలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు రూ.3,195. ఇదే కాలానికి ఏపీ జీఎస్టీ వసూళ్లు 9 శాతమే పెరిగాయి. 2019 జనవరిలో ఏపీ జీఎస్టీ వసూళ్లు రూ.2,159 కోట్లుగా ఉన్నాయి.

 

జనవరితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు కొద్దిగా తగ్గాయి. అదే సమయంలో ఆంధ్రాలో పెరిగాయి. 2020 జనవరిలో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు రూ. 3,787 కోట్లు ఉండగా.. ఫిబ్రవరిలో రూ.3,667 కోట్లు వసూలయ్యాయి. అంటే రూ.120 కోట్లు తగ్గుదల నమోదైంది. ఆంధ్రా విషయానికి వస్తే ఫిబ్రవరిలో రూ. 2,563 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. 2020 జనవరిలో ఈ వసూళ్లు రూ.2,356 కోట్లు. అంటే రూ.207 కోట్ల మేర పెరుగుదల నమోదైంది. కానీ రెండు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లను పోల్చి చూసినప్పుడు తెలంగాణ ఏపీ కంటే రూ.1,104 కోట్లు ఎక్కువగా జీఎస్టీ వసూలు చేసింది.

 

మొత్తానికి జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర, కర్ణాటక ముందజలో ఉన్నాయి. 2020 ఫిబ్రవరిలో మహారాష్ట్ర జీఎస్టీ వసూళ్లు రూ.15,735 కోట్లు కావడం విశేషం. తర్వాతి స్థానాల్లో కర్ణాటక - రూ.7,414 కోట్లు, గుజరాత్ - రూ.7,216 కోట్లు, తమిళనాడు - రూ.6,427 కోట్లు, ఉత్తర ప్రదేశ్ - రూ. 5,776 కోట్లు, హర్యానా 5,266 కోట్లు, పశ్చిమ బెంగాల్ - రూ. 3,942 కోట్లు, ఢిల్లీ - రూ. 3,835 కోట్లు ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ 9వ స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: