ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిన్నటివరకు 405 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు తాడేపల్లిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ అధికారులకు రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం కీలక సూచనలు చేశారు. 
 
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు పంపిణీ చేయాలని ఇందుకోసం మొత్తం 16 కోట్ల మాస్కులు అవసరమని పేర్కొన్నారు. వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో ఎక్కువ దృష్టి పెట్టాలని జగన్ అధికారులకు సూచించారు. అధికారులు రాష్ట్రంలో మూడో విడత సర్వే దాదాపుగా పూర్తైందని చెప్పారు. ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం లు 32,000 మందికి పరీక్షలు జరపాలని సూచించారని వీరిలో 9,000 మందికి పరీక్షలు చేయాలని వైద్యులు సూచించారని తెలిపారు. 
 
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాల్లో 45,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో వైరస్ ఉధృతి, వ్యాప్తి ఇతర విషయాల గురించి అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. సీఎం రక్తపోటు, డయాబెటిస్ వ్యాధులతో బాధ పడే వారి విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. 
 
వృద్ధులు కరోనా భారీన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని ... బీపీ, డయాబెటిస్ తో బాధ పడే వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని అత్యుత్తమ ఆస్పత్రుల్లో చేర్పించి వైద్య సహాయం అందించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈరోజు ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 417 కేసులు నమోదయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: