దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 843కు చేరగా తెలంగాణలో 945కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోనే 65 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 
 
అయితే కరోనా పరీక్షల్లో మాత్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ముందువరసలో ఉంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయని... ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఇతర రాష్ట్రాలు సైతం అభినందిస్తున్నాయని అన్నారు. 
 
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఏపీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని చెప్పారు. ఐ.సీ.ఎం.ఆర్ ఏపీలో నంబర్ వన్ స్థానంలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఉందని చెప్పడంతో జాతీయ మీడియా సైతం జగన్ ను అభినందిస్తోందని అన్నారు. సీఎం జగన్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైతులను ఆదుకోవడంలో ముందువరసలో ఉన్నారని చెప్పారు. 
 
పరిశ్రమలకు, పేదలకు ఉపశమనం కల్పించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. వైద్యపరమైన మౌలిక సదుపాయాల కల్పన చేయాలని కోరామని.... సోమవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఉపశమన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలు చేయడం చంద్రబాబుకు సరికాదని అన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి సమయంలో సలహాలు ఇవ్వాలని విమర్శలు చేయడం సరికాదని సూచించారు. జాతీయ మీడియా జగన్ ను ప్రశంసిస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.      
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: