దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు వైరస్ విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 33,000 దాటింది. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్ కావడం లేదు. మరోవైపు కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
కేంద్రం మే 3వ తేదీ తరువాత లాక్ డౌన్ ను కొనసాగించడానికి మొగ్గు చూపుతోంది. అయితే దేశంలో కరోనా నమోదైన ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించనుంది. కేంద్రం గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గ్రీన్ జోన్లలో సామాజిక దూరం పాటిస్తూ, ప్రజలు మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 
 
రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, షాపింగ్ మాల్స్ మినహా ఇతర దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతివ్వనుందని సమాచారం. కేంద్రాన్ని పలు రాష్ట్రాలు మరికొన్ని రోజులు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేయాలని కోరడంతో లాక్ డౌన్ విషయంలో ఆయా రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించనుందని తెలుస్తోంది. రెడ్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ నిబంధనలు యథాతథంగా కొనసాగనున్నాయి. 
 
రెడ్ జోన్లలో 14 రోజుల పాటు కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్ జోన్లను ఆరంజ్ జోన్లుగా.... ఆరంజ్ జోన్లలో 14రోజుల పాటు కేసులు నమోదు కాకపోతే వాటిని గ్రీన్ జోన్లుగా మార్చేలా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేయనుందని సమాచారం. వ్యాపారులు, ఉద్యోగులకు ఊరట కలిగేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు మినహా మిగతా జిల్లాల్లో ప్రభుత్వం సడలింపులు ఇవ్వనుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: