దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో గత వారం రోజుల నుంచి కరోనా తగ్గుముఖం పట్టినా పూర్తిస్థాయిలో వైరస్ అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో పాఠశాలలు ఎప్పటినుండి ప్రారంభం అవుతాయనే టెన్షన్ మొదలైంది. 
 
అయితే లాక్ డౌన్ ఎత్తివేస్తే జూన్ 12వ తేదీ నుంచే రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించినా విద్యాసంవత్సరం ప్రారంభానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని విద్యాశాఖ పేర్కొంది. రాష్ట్ర విద్యాశిక్షణ పరిశోధనా సంస్థ అధికారులు జూన్ 12వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించి 220 పనిదినాలు పూర్తి చేయాలని యోచిస్తున్నారు. 
 
విద్యాశిక్షణ పరిశోధనా సంస్థ డైరెక్టర్ శేషు కుమారి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల చివరి వారం నాటికి రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుందని భావించామని... విద్యాసంవత్సరాన్ని యథావిథిగా అమలు చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు ప్రారంభమైనా కరోనా కట్టడి చర్యలు కొనసాగుతాయని... తరగతిగదిలో 20కి మించి విద్యార్థులు ఉండకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలిపారు. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల కొరత వల్ల రొటేషన్ పద్ధతిలో తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే పదో తరగతి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకోనున్నామని అన్నారు. లాక్ డౌన్ ను పొడిగిస్తే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కూడా నిర్ణీత దూరం పాటించేలా ఆదేశాలు ఇవ్వనున్నామని తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: