ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అనంతరం రాష్ట్రాల మధ్య రాకపోకలు, ఇతర అంశాల గురించి సీఎం జగన్ అధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 
 
సీఎం జగన్ ఈ సమావేశంలో ప్రజల్లో కరోనాపై భయాన్ని పోగొడుతూ భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో కరోనాపై భయం పోగొడితే మాత్రమే వైరస్ పై సమర్థవంతంగా పోరాడగలమని పేర్కొన్నారు. అధికారులు సీఎం జగన్ కు విదేశాల్లో చిక్కుకుపోయినవారు నేటి నుంచి ఏపీకి రావడం ప్రారంభమవుతుందని చెప్పారు. వీరికి క్వారంటైన్ కేంద్రాల్లో ఉచితంగానే వసతులు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 
 
అధికారులు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎంకు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తూ ఉండటంపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారిని రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 
 
11 చెక్ పోస్టుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించడం వీలవుతుందని.... విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని యాప్ ద్వారా ట్రాక్ చేస్తామని తెలిపారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలను వాలంటీర్లు, ఆశా కార్యకర్తలకు తెలియజేస్తామని అన్నారు. లాక్ డౌన్ అనంతరం రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అనుసరించాల్సిన హెల్త్ ప్రోటోకాల్ గురించి సమావేశంలో విసృతంగా చర్చించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న 50 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1980కు చేరింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: