ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జగన్ అధికార యంత్రాంగాన్ని ఎగ్జిట్ ప్లాన్ లో భాగంగా ప్రజా రవాణా, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, థియేటర్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు కొనసాగించాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిన్న సీఎం జగన్ లాక్ డౌన్ ఎగ్జిట్ గురించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 
 
ఉన్నతాధికారులు సీఎం జగన్ కు కంటైన్మెంట్ క్లస్టర్లలో అనుసరించాల్సిన విధానం, లాక్ డౌన్ ఎగ్జిట్ గురించి ప్రతిపాదనలను వివరించారు. లాక్ డౌన్ ఎగ్జిట్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహం గురించి జగన్ ప్రధానంగా చర్చించారు. ఈ సమీక్షలో అధికారులు రాష్ట్రంలో 290 కంటైన్మెంట్ క్లస్టర్లు ఉన్నాయని... 75 కంటైన్మెంట్ క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదని చెప్పారు. 
 
కేసులు నమోదు కాని 75 కంటైన్మెంట్ క్లస్టర్లను డీనోటిఫై చేయాలని సూచించారు. ఈ కంటైన్మెంట్ క్లస్టర్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో కేసులు నమోదవుతున్న కంటైన్మెంట్ క్లస్టర్లలో మాత్రం నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. గడచిన 14 రోజుల్లో కేసులు నమోదు కాని డార్మంట్ క్లస్టర్లలో మాత్రం మే 31వ తేదీ తరువాత సాధారణ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 
 
సీఎం జగన్ ప్రధానంగా వలస కూలీల గురించి సమావేశంలో చర్చించారు. వలస కూలీల విషయంలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సీఎం జగన్ రాష్టంలో కరోనా కేసులు నమోదైన ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ను ఎత్తివేసేలా చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.                         
 

మరింత సమాచారం తెలుసుకోండి: