రేపటి నుంచి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఎయిర్‌పోర్టుల్లో సన్నాహాలు పూర్తయ్యాయి. అయితే ఆ మూడు రాష్ట్రాలు మాత్రం.. ఇప్పుడే వద్దంటున్నాయి. కేంద్రానికి సైతం తమ మొర విన్నవించుకున్నాయి. 

 

రెండు నెలల విరామం తర్వాత దేశంలో విమానాలు పైకెగరనున్నాయి. ప్రయాణీకులు ట్యాక్సీ ఎక్కడం మొదలుకుని, విమానాశ్రయాలకు చేరుకునే వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విమానయానశాఖ సూచించింది. ప్రయాణీకులు రెండు గంటల ముందు ఎయిర్‌పోర్ట్‌కు రావాలని సూచించింది. అంతేనా ఎయిర్ పోర్టుల్లో టచ్ ఫ్రీ వాతావరణం ఏర్పాటు చేస్తోంది. అంటే విమానాశ్రయంలోకి వెళ్లిన వాళ్లు పూర్తిగా కెమేరాలు, మిషన్ల సాయంతో థర్మల్ స్క్రీనింగ్, ట్యాగింగ్ పూర్తి చేసుకుని విమానం ఎక్కేయొచ్చు.

 

దేశీయంగా విమాన సర్వీసుల పునరుద్ధరణపై కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. దీనికి ఆయా రాష్ట్రాలు.. వాటి సమస్యలను చెబుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర విషయానికొస్తే... రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ 47వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో విమాన సర్వీసులను అనుమతిస్తే.. వచ్చే ప్రయాణికులను ఎలా ఇళ్లకు చేర్చాలని ప్రశ్నిస్తోంది ప్రభుత్వం. రెడ్ జోన్ల నుంచి గ్రీన్ జోన్లకు ప్రయాణాలు జరిగితే.. వైరస్ అదుపు మరింత కష్టసాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

 

అటు తమిళనాడు కూడా విజృంభిస్తోన్న వైరస్ అదుపు చేయడంపై ఫోకస్ పెట్టింది. ఈ పరిస్థితుల్లో  విమాన సర్వీసులు ప్రారంభిస్తే ... వైరస్ అదుపు చేయడం కష్టమని అంటోంది. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లోనూ... తమిళనాడు సీఎం పళనిస్వామి ఇదే విషయం చెప్పారు. కనీసం మే 31 వరకూ.. తమ రాష్ట్రంలో విమానసర్వీసులు ప్రారంభించొద్దని కోరారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలకు సైతం... తమిళనాడుప్రభుత్వం సమాచారమిచ్చింది.

 

ఉమ్‌పన్ తుపాను ధాటికి బెంగాల్ తీవ్రంగా దెబ్బతింది. ప్రధానంగా కోల్‌కతా, బగ్డోగ్రా జిల్లాల్లో అధికార యంత్రాంగం.. పూర్తిగా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో విమాన సర్వీసులు ప్రారంభిస్తే.. ప్రయాణికులను ఎలా తరలించాలని సీఎం మమత ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మమత . మే 28 వరకూ బెంగాల్లో విమాన సర్వీసులు ప్రారంభించొద్దని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: