ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే సీఎం జగన్ తీసుకున్న పలు నిర్ణయాల విషయంలో హైకోర్టులో ఎదురుదెబ్బలు తగలగా తాజాగా జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు ఏపీ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు గురించి కీలక తీర్పును వెలువరించింది. గతంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేసిన హైకోర్టు రమేశ్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ప్రభుత్వం పదవీ వయస్సును తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను కోర్టు రద్దు చేసింది. హైకోర్టు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఈ క్షణం నుంచే ఏపీ ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ కొనసాగుతారని కోర్టు పేర్కొంది. ఆర్డినెన్స్ రద్దు కావడంతో తక్షణమే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగనున్నారు. 
 
హైకోర్టు తీర్పు విషయంలో జగన్ అతి విశ్వాసమే కొంపముంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో రమేశ్ కుమార్ ప్రభుత్వంతో చర్చలు జరపకుండా ఆరు వారాలు ఎన్నికలను వాయిదా వేస్తూ ప్రకటన చేశారు. అనంతరం ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని తగ్గించి హైకోర్ట్ రిటైర్డ్‌ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 
 
అయితే వరుసగా కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కోర్టుల నుంచి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాల్సి ఉంది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేక తీర్పులు ఇస్తూ ఉండటం ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని తగ్గిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల జగన్ భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: