ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రిమండలి ఈరోజు ఉదయం సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్ కు ఆమోదముద్ర వేసింది. సాధారణంగా 14 రోజుల పాటు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఈసారి రెండు రోజుల్లోనే ముగించనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్యాహ్నం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 
 
మంత్రి కన్నబాబు వ్యవసాయ శాఖ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వం మధ్యాహ్నం 2.45 లోపు ఉభయ సభలను పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూ ఉండటంతో జగన్ సర్కార్ ఈ నెల 17న ప్రారంభించాలని అనుకున్న వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని వాయిదా వేసింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 
 
ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. కరోనా వల్ల రాష్ట్రంలో చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరు నెలల ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల వల్ల తాత్కాలికంగా ఈ పథకం అమలు వాయిదా పడింది. ప్రభుత్వం ఈ పథకం కింద చేనేత కార్మికులకు 24,000 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. 
 
రాష్ట్రంలో 69,308 మంది కుటుంబాల చేనేత కార్మికులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది. ఈ నెల 20న జగన్ ఆన్ లైన్ ద్వారా వీరికి నగదు జమ చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ రాజ్‌భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ఆన్‌లైన్ ద్వారా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం అనేది దేశంలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: