ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 9,834 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పది వేలకు చేరువ కావడంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో 4,592 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 5,123 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 8 మంది మృతి చెందారు. 
 
భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన కరోనా నివారణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే మూడు నెలల కాలంలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 104 వాహనాల ద్వారా నమూనాలను సేకరించాలని.... బీపీ, డయాబెటిస్ సమస్యలతో బాధ పడేవారికి అక్కడికక్కడే మందులు ఇవ్వాలని చెప్పారు. 104 సిబ్బందితో పాటు ఏ.ఎన్.ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ వాలంటీర్లు అనుసంధానం వేగంగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 
 
సీఎం జగన్ తీసుకున్నది మంచి నిర్ణయమే అయినప్పటికీ ఈ నిర్ణయం అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో దాదాపు కోటిన్నర పరీక్షలు చేయాలి. ఇంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించడం సాధారణమైన విషయం కాదు. దేశంలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందువరుసలో ఉంది. 
 
అయితే టెస్టులు అధికంగా చేయడం వల్ల లక్షణాలు కనిపించని కేసులు సైతం బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమే అని చెప్పవచ్చు.                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: