దశాబ్దాలుగా వివిధ కారణాల వల్ల ఆలస్యంగా పూర్తవుతూ వస్తున్న ప్రాజెక్ట్ పోలవరం. 40 సంవత్సరాల క్రితం ప్రారంభం కావాల్సి ఉన్నా నిర్లక్ష్యం, ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నేటికీ పూర్తి కాలేదు. పక్కా ప్రణాళికతో ప్రారంభం కాకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేయాలని సంకల్పించారు. 
 
రాజశేఖర్ రెడ్డి హయాంలో కాలువలకు సంబంధించిన పనులు పూర్తైనా అసలు ప్రాజెక్టుకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలవరం అసలు ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలయ్యే సమయంలో రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు. అనంతరం కాంగ్రెస్ ఆ ప్రాజెక్ట్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో నిర్మాణంలో వేగం పుంజుకుంది. 
 
16,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలైన ప్రాజెక్టుకు ప్రస్తుతం 58,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన పోలవరం విషయంలో నిర్లక్ష్యం వహించిందని టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. గతంలో రాజధాని విషయంలో టీడీపీపై జగన్ విమర్శలు చేయగా ప్రస్తుతం జగన్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 
 
అయితే తొలి ఏడాది సంక్షేమంపై దృష్టి పెట్టిన జగన్ ప్రస్తుతం పోలవరం శరవేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో ప్రాజెక్టు పూర్తవుతుందని తెలుస్తోంది. 2021 చివరినాటికి పోలవరం పూర్తవుతుందని వైసీపీ చెబుతున్న మాటలు నిజమవుతాయో లేదో చూడాల్సి ఉంది. చంద్రబాబు 2018లోపే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పానని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. మరి జగన్ ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేస్తారో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: