వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లూ పూర్తిగా పాలించిన చివరి ముఖ్యమంత్రి.. సంక్షేమ రాజకీయాల ద్వారా రాష్ట్ర చరిత్రలో సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రిగా జనం జేజేలు అందుకున్నారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాల ద్వారా రైతుకు రైతు బాంధవుడయ్యారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి మంచి మనసున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 

 


నిరుపేదల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివేందుకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించేలా ఫీజు రీఎంబర్స్ మెంట్‌ పథకం తీసుకొచ్చి లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్ మార్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటా రెండా.. కానీ.. ఇంతటి సుపరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్‌ ఫ్లాష్ బ్యాక్ తిరగేస్తే... ఆశ్చర్యపోకమానరు. మొదటి నుంచి కడవరకూ కాంగ్రెస్ లోనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నిత్య అసమ్మతి వాదిగా ముద్ర పడ్డారు.  

 


కడప ఫ్యాక్షన్ రాజకీయాలకు వైఎస్ చిరునామా అంటూ అప్పట్లో గిట్టని వాళ్లు పదే పదే ఎత్తి చూపేవాళ్లు. నిత్యం అలజడి రాజకీయమే వైఎస్ చిరునామాగా మారుతూ వచ్చింది. వైఎస్‌లో ఆవేశం పాలు చాలా ఎక్కువ. కోపం అధికం.. అది రాజకీయాల్లోనూ ప్రతిబింబించేది. చివరకు సొంత పార్టీ ముఖ్యమంత్రులపైనా కూడా ఆయన చెప్పులు వేయించాడని చెప్పుకుంటారు. ఆయన్నో కరడు గట్టిన ముఠానాయకుడిగా చిత్రించేవి ఆనాటి పత్రికలు. 

 


మరి అలాంటి ముఠానాయకుడు, ఫ్యాక్షనిస్టుగా పేరుబడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చివరినాళ్లలో ఓ దేవుడిగా ఎలా ప్రజలతో నీరాజనాలు అందుకున్నారు. ఇందుకు సమాధానం కూడా ఆయనే చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో తనకు విపరీతమైన కోపం, అసహనం ఉండేవని.. కోపాన్ని అధిగమించడం వల్లే తాను అందరికీ ఆమోదయోగ్యుడిని అయ్యానని చెప్పుకున్నారు. తనలో ఇప్పుడు కోపం నరం తెగిపోయందని ఓ ఇంటర్వ్యూలో వైఎస్ చెప్పారంటే.. ఆయన ఎంతగా మారిపోయారో అర్థం చేసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: