దేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును యోగి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని సీబీఐకి అప్పగించినా... నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ మరింత ఊపందుకుంది. మరోవైపు రాజకీయ పార్టీల నేతలు హాత్రస్‌కు వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.. పోలీసుల ప్రతిఘటన మధ్యే ఎస్పీ నేతలు హథ్రాస్ చేరుకొని భాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదుచేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ప్రభుత్వం నిందితులను రక్షించే ప్రయత్నం చేసిందని ఎస్పీ నేత అజంఖాన్ ఆరోపించారు.
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి వై సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పోలీసులతో పాటు అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని... సుప్రీంకోర్టు మాజీ జడ్జితో ఈ కేసు విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సిట్ బృందం వారి నుంచి వివరాలు సేకరించేందుందుకు ప్రయత్నించింది. అయితే బాధిత యువతి కుటుంబ సభ్యులు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. కేసును సిబీఐకి ఇస్తే మీరెలా దర్యాప్తు చేస్తారని ప్రశ్నించారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని... సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్నారు. ఇక హత్రాస్ జిల్లా ఎస్పీ వినీత్ జైశ్వాల్... అత్యాచారం జరిగినట్లుగా భావిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు.
హత్రాస్ ఘటన వ్యవహారంలో జిల్లా కలెక్టర్ వ్యవహరించిన తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. బాధిత కుటుంబాన్ని కలెక్టర్ బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై యోగి సర్కార్ ఎందుకు మౌనంగా ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి నిలదీశారు. మరోవైపు కాంగ్రెస్ నేత నిజాం మాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నిందితుల తలలు నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో యూపీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొత్తమ్మీద హాత్రస్ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి