జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిఓటూ కీలకమే. అందులోనూ సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ లో కాస్త గుబులుగానే ఉంది. ఏపీనుంచి వచ్చినవారి జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా ఓట్లు ఏ పార్టీకి పడితే, వారు గెలుస్తారనే అంచనా ఉంది. అందుకే సెటిలర్ల ఓట్లపై గట్టి నమ్మకంతో ఉంటాయి అన్ని పార్టీలు. అయితే పోలింగ్ మొదలై గంటలు గడుస్తున్నా.. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న డివిజన్లలో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నట్టు సమాచారం.

గ్రేటర్ ఎన్నికల్లో ఉదయం 7 గంటలనుంచే సందడి మొదలైంది. ప్రముఖులంతా తొలి గంటలోనే తమ ఓటు హక్కు వినియోగించుకుని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక ప్రముఖులు ఓటు వేసే బూత్ ల వద్ద మీడియా హడావికి కూడా బాగా ఎక్కువగా కనిపించింది. రాగా పోగా.. సెటిలర్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ మందకొడిగా సాగుతున్నట్టు సమాచారం.

సెటిలర్ల ఓట్లపై ఆశలు పెట్టుకున్న పార్టీలన్నీ ఇప్పుడు ఆందోళనలో పడ్డాయి. ముఖ్యంగా టీడీపీ సెటిలర్ల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ఆయా డివిజన్లలో టీడీపీ జెండా ఎగరేయాలని, తెలంగాణలో పార్టీ ఇంకా బతికే ఉందనే సంకేతాలు పంపాలని టీడీపీ ఆశపడుతోంది. అధిష్టానం ప్రచారానికి రాకపోయినా పూర్తిగా సోషల్ మీడియాపై ఆధారపడి బరిలో నిలిచారు టీడీపీ అభ్యర్థులు. మరోవైపు టీఆర్ఎస్ కూడా అభివృద్ధి మంత్రంతో సెటిలర్ల ఓట్లగు గాలమేయాలని చూస్తోంది. అటు బీజేపీ, జనసేన మద్దతుతో సెటిలర్ల ఓట్లలో మెజార్టీ భాగం తమకే దక్కుతాయని ఆశపడుతోంది. మరి ఆయా వర్గాలు ఏమనుకుంటున్నాయనే విషయం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఉదయాన్నే సెటిలర్ల ప్రాంతాల్లో ఓటింగ్ పెద్దగా జరక్కపోవడంతో.. వారి ఓటు ఎటువైపు అనే ఆలోచనలు నిండిపోయాయి. దీంతో మధ్యాహ్నం వరకు సెటిలర్ల ఓట్లపై సస్పెన్స్ కొనసాగేలా ఉంది. మరోవైపు స్థానికంగా ఉన్న నేతల్ని పురమాయించి వారికి ఫోన్లు చేయించాలని, పోలింగ్ బూత్ ల వరకు తెప్పించాలని చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: