తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా హామీల వర్షం కురిపించడం టీఆర్ఎస్ కి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు జానారెడ్డి. కేవలం ఎన్నికల సందర్భంగానా వరాలిస్తారని, ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తారని చెప్పారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను జానారెడ్డి ఖండించారు. నెల్లికల్ ఎత్తిపోతలకు తానే అనుమతులు తీసుకొచ్చినట్లు చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యల్ని జానా రెడ్డి తిప్పికొట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారాయన. రుణ మాఫీ, మూడెకరాల భూపంపిణీ ఏమైందని సూటిగా ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ గతంలోనే ఉందని, బంగారుతల్లి పథకాన్ని కల్యాణలక్ష్మిగా పేరు మార్చారు కానీ, కొత్తగా కేసీఆర్ చేసిందేమీ లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర పరిమితం అని, తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు జానారెడ్డి. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపైనే కేసీఆర్ ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారాయన. ప్రత్యేక రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ పై నమ్మకం పెట్టుకుని ప్రజలు గెలిపిస్తే వారిని మోసం చేశారని జానా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ఇచ్చిన ఎన్నికల హామీలనే ఇంకా కేసీఆర్ నెరవేర్చలేదని, కేసీఆర్ కి బుద్ధి చెప్పాలంటే ఆ పార్టీ అభ్యర్థిని ఓడించాలని కోరారు.
మొత్తమ్మీద హాలియా సభతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రచ్చ మొదలైనట్టు అర్థమవుతోంది. కేసీఆర్ వ్యాఖ్యల్ని జానారెడ్డి తిప్పికొట్టడంతోపాటు, సాగర్ ని దృష్టిలో పెట్టుకునే ఆ విమర్శలు చేశారని మండిపడ్డారు. జానా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్గం స్పందిస్తే.. అప్పుడు ఉప ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి