ఏపీలో 16వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీలున్నట్లు తాజాగా పాఠశాల విద్యాశాఖ లెక్క తేల్చింది. వీటిలో 402 బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. వీటి భర్తీకి ప్రభుత్వ ఆమోదం లభించింది. మిగిలిన 15,926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఈ పోస్ట్ ల భర్తీకోసం మొదటగా మినీ డీఎస్సీ, ఆ తర్వాత సాధారణ డీఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడుతుంది. ఇందులో మిగిలిన వాటిని తిరిగి జనరల్ కేటగిరీకి మారుస్తారు.
డీఎస్సీతోపాటే ఈసారి టెట్ ని కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. టెట్‌ను ఆన్ లైన్ లో నిర్వహించాలని అనుకున్నా అది కుదరలేదు. ఈసారి సిలబస్ పూర్తిగా మారిపోవడం, ఇంగ్లిష్ మీడియం తేవాలనుకోవడంతో.. టెట్ లో కూడా ఆంగ్ల నైపుణ్యాన్ని పరీక్షిస్తారని తెలుస్తోంది.
పాత నియామకాల లెక్క తేలేదెప్పుడు..
రెండేళ్ల క్రితం ప్రకటించిన డీఎస్సీ-2018లోని అన్ని పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. న్యాయ వివాదాలతో కొన్ని నియామకాలు నిలిచిపోయాయి. మొత్తం 7,902 ఖాళీలలో 860 పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు తీర్పు తర్వాత వీటి నియామకాలపై చర్యలు తీసుకుని ఆ తర్వాత కొత్తగా డీఎస్సీకి ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది.
బ్యాక్ లాగ్ డీఎస్సీ ప్రకటన వెలువడినప్పటి నుంచి అన్నీ సవ్యంగా జరిగితే నియామకాల పూర్తికి రెండున్నర నెలల సమయం పడుతుంది. నియామకాల ప్రకటనకు పరీక్షకు మధ్య 45 రోజులు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పరీక్ష, ఫలితాలు, కౌన్సెలింగ్ కు మరో నెల వరకు సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాతే సాధారణ డీఎస్సీకి ప్రకటన ఉండొచ్చని అంటున్నారు అధికారులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి