ఇంటి వద్దకే రేషన్ అనే విధానంతో మొబైల్ వాహనాలు తీసుకొచ్చి పేదలకు మేలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా మొబైల్ వాహనాల వల్ల నిరసనలు, ఆందోళనలు ఎక్కువయ్యాయి. తమకు జీతాలు సరిపోవట్లేదని గతంలో వాహనాల డ్రైవర్లు ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగొచ్చి వారికి జీతాలు పెంచింది. అయితే ఆ వెంటనే గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా ట్రక్ డ్రైవర్లతో పోటీ పెట్టుకుని జీతాలకోసం డిమాండ్ చేశారు. దీనికి మాత్రం ప్రభుత్వం దిగి రాలేదు. ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. ఆ తర్వాత కూడా జీతాలు సరిపోవట్లేదని, సహాయకులకు కూడా ప్రభుత్వమే జీతాలివ్వాలంటూ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. తమకీ ఉద్యోగం సరిపోదని, రేషన్ ట్రక్కులు ఎంపీడీవో ఆఫీసుల్లో ఇచ్చేసి వెళ్లిపోతున్నారు.

ఇక ఇప్పుడు మరో కొత్త సమస్య తెరపైకి వస్తోంది. అందరూ అని చెప్పలేం కానీ, కొన్ని చోట్ల రేషన్ ట్రక్ డ్రైవర్లు కొత్త బిజినెస్ కి తెరతీశారు. గతంలో రేషన్ డీలర్లు తమ షాపుల్లోనే ఇతర వస్తువులు కూడా అమ్ముతున్నట్టు.. రేషన్ ట్రక్కులనే మొబైల్ బిజినెస్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం, కందిపప్పు, చక్కెర మినహా ఇంకేవీ విక్రయించకూడదని, ఇంకే ఇతర అవసరాలకు వాహనాలను వాడకూడదనే నిబంధన ఉన్నా కూడా వాటితో వ్యాపారం మొదలు పెట్టారు.

రేషన్ సరకులు ఇంటి వద్దకే పంపిణీ అనే పథకంపై మొదటినుంచీ విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వృథా ఖర్చు పెడుతోందని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం ఇంటివద్దకే రేషన్ విధానం బాగుందని చెబుతున్నారు. అయితే అన్ని చోట్లా ప్రజల ఇంటివద్దకే రేషన్ సరకులు వెళ్తున్నాయా అంటే అనుమానమే. ఆ వీధిలో వాహనం వద్దకు వెళ్లి ప్రజలు సరకులు తెచ్చుకుంటున్నారు. డోర్ డెలివరీ అంటే ప్రజల డోర్ వద్దకు కాదు, వాహనం డోర్ వద్దకు అంటూ ఇటీవలే నారా లోకేష్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ నేపథ్యంలో అసలు వాహనాల్లో ఇతర సరకులు విక్రయించడం మరింత వివాదానికి దారి తీస్తోంది. చిల్లర సమస్య ఉన్నప్పుడు షాంపూలవంటి చిన్న చిన్న వస్తువుల వంటివి ఇవ్వడాన్ని ఎవరూ ఆక్షేపించరు. అయితే అదే పనిగా దాన్ని ఓ వ్యాపారంగా మార్చుకుంటే మాత్రం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్టే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి పెడితే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: