జ‌గ‌న్ కు పీఆర్సీ  ఫియ‌ర్ ?

డ‌బ్బులా లేవు.. ప‌నులా కావ‌డం లేదు.. ఆదాయం అంతంత మాత్రం.. అప్పులు కూడా పుట్ట‌డం లేదు.. అంతా క‌రోనా ప్ర‌భావం.. పోనీ సంక్షేమ ప‌థ‌కాలా ఆపేదే లేదు.. ఇదిగో ఇవాళ విద్యా దీవెన కింద 690 కోట్ల‌కు పైగా నిధులు విడుద‌ల చేసి మ‌ళ్లీ సీఎం వార్త‌ల్లో నిలిచారు. అలాంట‌ప్పుడు తమ‌కు ఎందుకు ఆర్థిక ల‌బ్ధి చేకూర్చ‌రు అన్న‌ది ఉద్యోగ సంఘాల వాద‌న. ఇలా అయితే తాము ప్ర‌త్య‌క్ష నిర‌స‌న‌ల‌కు దిగుతామ‌ని హెచ్చ‌రిస్తున్నాయి ఆయా సంఘాలు.. క‌నీసం త‌మ గోడు ప‌ట్టించుకునే వారే లేర‌ని వాపోతున్నారు ఆ సంఘాల ప్ర‌తినిధులు.


కొత్త పీఆర్సీ ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌లేరు..అలా అని ఇస్తామ‌ని అన‌లేరు..ఇలాంటి సంక‌ట స్థితిలో ఏపీ సీఎం జ‌గ‌న్ ఉన్నారు అన్న‌ది వాస్త‌వం. ఒక్క ఏప్రిల్ నెల‌కే పంతొమ్మిది వేల కోట్ల రూపాయ‌లకు పైగా అప్పు చేసిన ఆంధ్ర ప్ర‌దేశ్ సర్కారుకు ఉద్యోగుల జీత భ‌త్యాల చెల్లింపే చాలా స‌మ‌స్యగా ఉంది. మ‌రోవైపు తాను చెప్పిన ప‌ని చేయ‌కుండా, త‌న మాట పాటించ‌కుండా ఉంటే ఉద్యోగుల ను ఆదుకునేదే లేద‌ని  చెప్పారు సీఎం ఓ సంద‌ర్భంలో! నేరుగా ఇలా చెప్ప‌కున్నా అర్థ ధ్వ‌ని మాత్రం ఇదే..దీంతో బండి శ్రీ‌ను లాంటి ఏపీ ఎన్జీఓ లీడ‌ర్లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. వాస్త‌వానికి పాత సీఎం చంద్ర‌బాబు హ‌యాంలోనే తాము బాగున్నామ న్న భావ‌న ఇవాళ ఉద్యోగుల్లో ఉంది. ఆ రోజు ఆయ‌న హెచ్ ఆర్ ఓకే చేశార‌ని, శ్రీ‌కాకుళం, చిత్తూరు ఉద్యోగుల‌కు ఆ విధంగా ఇర‌వై ప‌ర్సంట్ హెచ్ ఆర్ వ‌ల్ల ఎంతో ల‌బ్ధి జ‌రిగింద‌ని, అలానే స‌మైక్యాంధ్ర ఉద్య‌మ కాలానికి సైతం స్పెష‌ల్ లీవ్ కింద జీతం చెల్లించార‌ని, ఇలా ఆయ‌న‌కు చేత‌నైనంత చేస్తూనే వ‌చ్చార‌ని, కానీ జ‌గ‌న్ మాత్రం త‌మ మాట విన‌డం లేదు అని అంటున్నారు.


ఈ ద‌శ‌లో జ‌గ‌న్ కు అనుబంధంగా ఉండే ఎంప్లాయీస్ అసోసియేష‌న్ కూడా ఇవాళ వ్య‌తిరేకంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి కిప్పుడు ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌ని సీఎస్ కూడా చెబుతున్నారు. ఆర్థిక ప్ర‌యోజ‌నాలు మిన‌హా ఏ స‌మ‌స్య‌లు ఉన్నా తేల్చేందుకు తాము సిద్ధ‌మేన‌ని సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్  మాట.. మ‌రోవైపు స‌చివాల‌య ఉద్యోగులూ ఇలానే సీఎంపై కోపంగానే ఉన్నార‌ని తెలుస్తోంది. క‌రోనా స‌మ‌యంలో త‌మ‌కి తాము ఉన్నంత‌లో ఏదో స‌ర్దుబాటు చేసుకుని బాధిత ఉద్యోగుల‌కు సాయం చేసుకున్నామే త‌ప్ప ప్ర‌భుత్వం ఇచ్చిన సాయం ఏమీ లేదని తేల్చేశారు. ఇలా అన్ని సంఘాలూ సంఘ‌ట‌న‌లూ సీఎంకు వ్య‌తిరేకంగా ఉన్నాయి..మ‌రి! వీటిపై జ‌గ‌న్ ఏ విధంగా స్పందిస్తార‌న్న‌ది కీల‌కం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: