కరోనాకు టీకా ఒక్కటే మార్గం.. ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్నది ఇది. అయితే టీకా రెండు డోసులూ తీసుకున్నా కరోనా నుంచి రక్షణ లేదని ఇటీవల కొన్ని సర్వేలు చెబుతున్నాయి. టీకా డోసులు తీసుకున్న వారిలోనూ యాంటీ బాడీలు సరిగా వృద్ధి చెందలేదని తెలుస్తోంది. మరి యాంటీ బాడీలు సరిగ్గా లేకపోతే..ఇక టీకా వేసుకుని ఏం ప్రయోజనం.. ఇలాంటి వారికి  రెండు డోసులు వేసుకున్నా ఎలాంటి సేఫ్టీ లేనట్టేనా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.


ఇటీవల ఐసీఎంఆర్‌ అహ్మదాబాద్‌లో సెరో సర్వే నిర్వహించింది. దీనిని బట్టి అక్కడి  81.63 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నాయట. అంటే ఇదివరకే కొవిడ్‌ సోకడం ద్వారా లేదా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఎక్కువ మందిలో  యాంటీబాడీలు కనిపిస్తున్నాయట. కొందరిలో మాత్రం టీకా తీసుకున్నా యాంటీబాడీలు కనిపించలేదట. దీంతో తమకు యాంటీబాడీలు వృద్ధి చెందాయో లేదోననే ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. తగినంతగా యాంటీబాడీలు కనిపించకపోతే టీకాలు పనిచేయనట్టేనా అన్న అనుమానం వస్తోంది.


అయితే నిపుణులు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. రోగనిరోధక శక్తిని కేవలం ప్రతిరోధకాలు మాత్రమే నిర్ధారించలేవని.. కాబట్టి యాంటీ బాడీ టెస్టులు చేయించుకోవడం  నిరర్ధకం అని చెబుతున్నారు. టీకా తీసుకున్నాక శరీరంలోని టి ,  మెమొరీ కణాలు మరింత బలం పొందడం, నిరోధక శక్తిని పెంచుకోవడం జరుగుతుందని అంటున్నారు. అంతే కాదు.. ఎముక మజ్జల్లో ఉండే టి-కణాల్లోని రోగనిరోధకత టెస్టుల ద్వారా పసిగట్టలేమని చెబుతున్నారు.


ఎవరికైనా యాంటీ బాడీ టెస్టుల్లో నాన్‌ రియాక్టివ్‌ లేదా నెగటివ్‌ అని వస్తే, వారికి టీకాలు పనిచేయలేదని కాదని నిపుణులు అంటున్నారు. అసలు యాంటీబాడీలకు, టీకాల పనితీరుకు ముడి పెట్టకూడదంటున్నారు. సందేహాలతో యాంటీబాడీల టెస్టుల కోసం వెళ్లక్కర్లేదని.. వ్యాక్సిన్లు తీసుకున్నాక వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా యాంటీ బాడీలు విడుదలైనా అవి టెస్టుల్లో కనిపించట్లేదని చెబుతున్నారు. అందుకే టీకాలపై ఎలాంటి సందేహాలు వద్దు. టీకా తీసుకుంటే కరోనా ముప్పు నుంచి చాలా వరకూ తప్పించుకున్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: