ఇటీవల కాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అనేకసార్లు సూచిస్తున్నారు. తెలియని నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకపోవడమే మంచిదని, ఒకవేళ లిఫ్ట్ చేసినా జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. కానీ.., కొందరు ఈ విషయాలు ఏం పట్టించుకోకుండా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. కేవైసీ అప్డేట్ అంటూ ఫోన్ చేసి సైబర్ నేరస్థలు ఏకంగా 5 లక్షల రూపాయలు కాజేశారు.

ఈ ఘటనకు సంబంధించి అసలేం జరిగిందంటే.. సిటీలోని డీడీ కాలనీకి చెందిన కాలనీకి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి రెండ్రోజుల కిందట ఓ వ్యక్తి కాల్ చేశాడు. తాను టెలికాం సంస్థ అని కాల్ చేస్తున్నట్లు పేర్కొని, సత్యనారాయణను బాగా నమ్మించాడు.  సత్యనారాయణకు సంబంధించిన పలు వివరాలు చెప్పి, సిమ్ కార్డును అప్డేట్ చేసుకోకపోతే సర్విస్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఈ క్రమంలోనే సిమ్ కార్డు కొనసాగాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందుకుగాను ఆన్లైన్ పేమెంట్ చేయాలని అతడికి సూచించాడు.

ఇందుకోసం మొబైల్ నెంబర్‌ కు ఓ లింక్ పంపిస్తానని చెప్పాడు. అంతే సత్యనారయణ ఆ లింక్ ఎందుకు..? అని ప్రశ్నించకుండానే సదరు లింక్ ఓపెన్ చేసి అతడి వివరాలు పూర్తిగా ఎంటర్ చేశాడు. అంతటితో ఆగకుండా సైబర్ నేరస్థుడికి ఓటీపీ కూడా తెలిపాడు. ఇంకేముంది సదరు వ్యక్తి అకౌంట్ నుంచి రూ. 5 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత తనకు కాల్ చేసిన నెంబర్‌ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దాంతో సత్యనారాయణ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. అప్డేట్స్, వెరిఫికేషన్ అంటూ వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: