హైదరాబాద్ లోని ఆరేళ్ల చిన్నారి పాపపై మానవ మృగం రాజు చేసిన అఘాయిత్యం తల్చుకుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా పోలీసులు నిందితుడిని పట్టుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వేల మంది పోలీసులు, లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఉన్నా.. అతడు చిక్కలేదు. ఆచూకీ చెబితే 10లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారు. అటు నిందితుడిని కాల్చి చంపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్.. సైదాబాద్ కాలనీలోని ఆరేళ్ల చిన్నారిని హత్యాచార ఘటనలో నిందితుడు రాజును బస్తీ నుంచి ఓ స్నేహితుడు తప్పించినట్టు తెలుస్తోంది. ఎవరూ గుర్తుపట్టకుండా టోపీ, మాస్క్, టవల్, బట్టలతో కూడిన ఓ సంచిని రాజుకు స్నేహితుడు ఇచ్చినట్టు సమాచారం. వారిద్దరూ కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అటు ఘటన జరిగిన తర్వాత చిన్నారి తల్లిదండ్రులు రాజును అనుమానించినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు నిందితుడు రాజు కోసం 100మంది పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఘటన జరిగిన రోజు ఎల్బీనగర్ లో తన స్నేహితుడితో కలిసి నిందితుడు మద్యం సేవించినట్టుగా గుర్తించారు. అతడి స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని స్నేహితుడు పోలీసులకు చెప్పగా.. గతంలో రాజుపై ఒక బైక్ చోరీ కేసు ఉన్నట్టు గుర్తించారు.

ఆరేళ్ల పాపపై జరిగిన హత్యాచారం ఘటనను సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల కంటే సీరియస్ గా తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడు రాజును పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారనీ.. ఇప్పుడు ఆచూకీ చెబితే 10లక్షల రూపాయల రివార్డ్ ఇస్తామని పోలీసులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.  నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారంటూ ఇటు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని కొందరంటుంటే... ఎన్ కౌంటర్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: