నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్‌ ప్రముఖ హీరోల్లో ఒకరు.. వయసైపోతున్నా ఇంకా నటుడిగా అలరించేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఆయన కేవలం నటుడే కాదు.. ఓ ఎమ్మెల్యే  కూడా.. అయితే ఆయన ఫుల్ టైమ్‌ పొలిటిషియన్ కాదు.. అప్పడప్పుడు తన నియోజక వర్గంలో పర్యటిస్తుంటారు.. వెళ్లినప్పుడల్లా ఓ మాంచి ర్యాలీ నిర్వహిస్తారు.  అయితే తాజాగా ఆయన తన నియోజక వర్గంలో పర్యటించారు.


ఇదే సమయంలో అనంతపురం జిల్లా ఎదుర్కొంటున్న నీటి సమస్యపై నిర్వహించిన ఓ సదస్సు ప్రసంగించారు. ఆ ప్రసంగంలోనే అవసరమైతే..  రాయలసీమలో నీటి ప్రాజెక్టుల కోసం డిల్లీ వెళ్లి పోరాటం చేస్తామని టిడిపి నేత నందమూరి బాలకృష్ణ అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులపై హిందుపూర్ లో  టీడీపీ నిర్వహించిన సదస్సులో  బాలయ్య ఈ మాటలు అన్నారు. అంతే కాదు.  జగన్ సర్కారు వైఖరిపై బాలయ్య ఘాటు విమర్శలు చేశారు.


అసలు వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమకు నీరు ఇచ్చే ఆలోచన లేదని బాలకృష్ణ విమర్శించారు. గతంలో తన తండ్రి ఎన్.టి.రామారావు హంద్రీ-నీవా ప్రాజెక్టును ప్రారంభించారని బాలయ్య గుర్తు చేసుకున్నారు.  ఈ జగన్ ప్రభుత్వం చెరువులకు నీళ్లు ఇవ్వడం లేదంటున్న బాలయ్య.. ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మతాల విబేధాలు తెస్తోందని విమర్శలు చేశారు. అయితే బాలయ్య మాటల్లో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమో లేదు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం విమర్శించకపోతే ఎలా.. అన్న ప్రశ్న వస్తుంది.


అంత వరకూ ఓకే కానీ.. అనంతపురం నీటి సమస్య గురించి మరీ డిల్లీ స్థాయి పోరాటం చేస్తానని చెప్పడమే అంత సూటబుల్‌గా అనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం లేదంటున్న బాలయ్య ఆ విషయం గురించి జగన్‌తో పోరాడకుండా.. ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తాననడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా నీటి కోసం ఉద్యమించే హక్కు బాలయ్యకు ఎలాగూ ఉంది. కానీ ఆ పోరాటం క్షేత్ర స్థాయిలోనో.. తాడేపల్లి స్థాయిలోనే చేయకుండా ఢిల్లీ వెళ్లి చేస్తే మాత్రం ఉపయోగం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: