నరేంద్రమోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల్లో దేనికదే మోడీని వ్యతిరేకిస్తున్నాయి. అయితే అన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావటమే కష్టంగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆప్, టీఆర్ఎస్ లాంటి పార్టీలు కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎన్సీపీ, జేడీఎస్, శివసేన లాంటి పార్టీలేమో కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయం సాధ్యం కాదని చెబుతున్నాయి. ఇలాంటి నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి.




అవటానికి ఐదురాష్ట్రాల ఎన్నికలే అయినా యూపీ మాత్రమే హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే యూపీ ఎన్నికల్లోనే మోడీయా లేకపోతే ప్రతిపక్షాలా అన్నది తేలిపోతుంది. ప్రతిపక్షాల్లోని కొన్ని ప్రధాన పార్టీలు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా రంగంలోకి దిగాయి. అఖిలేష్ తో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ పొత్తులు పెట్టుకున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా చిన్నా చితక నాలుగుపార్టీలు ఎస్పీతో పొత్తుల్లో పెట్టుకున్నాయి.




ఎస్పీతో పొత్తుపెట్టుకుని ఏడుపార్టీలు పోటీచేస్తుంటే మద్దతుగా శివసేన, టీఆర్ఎస్, ఆర్జేడీ యూపీకి వెళ్శి ప్రచారం  చేయబోతున్నాయి. అంటే దేశంలోని ప్రముఖ పార్టీల్లో చాలావరకు మోడీకి వ్యతిరేకంగా అఖిలేష్ కు మద్దతుగా యూపీలో మోహరిస్తున్నాయని అర్ధమవుతోంది. బీజేపీని ఓడించటానికి అఖిలేష్ కు నిజంగా ఇంతకుమించిన బ్రహ్మాండైన అవకాశం భవిష్యత్తులో రాకపోవచ్చు. మోడీకి వ్యతిరేకంగా శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆప్, టీఎంసీ, టీఆర్ఎస్ పార్టీలు అఖిలేష్ కు మద్దతుగా నిలవటమంటే మామూలు కాదు.




ప్రతిపక్షాల వరస చూస్తుంటే 2024 ఎన్నికలకు యూపీ ఎన్నికలను ట్రైలర్ లాగ ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లున్నాయి.  అందుకనే ఇంత పట్టుదలగా యూపీ ఎన్నికల్లో అఖిలేష్ కు మద్దతుగా నిలబడ్డాయి. ఎస్పీ+మిత్రపక్షాల కష్టం ఫలించి అధికారంలోకి వస్తే రేపటి రాష్ట్రపతి ఎన్నికలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయి. పనిలోపనిగా 2024 ఎన్నికలకు రెడీ అవుతాయి. ఒకవేళ అధికారం మళ్ళీ బీజేపీకే దక్కితే మోడీ స్టామినా ఏమిటో అందరికీ తెలుస్తుంది. కాబట్టి 2024 ఎన్నికలకు ప్రతిపక్షాలు కొత్త ఫార్ములా కనిపెట్టాల్సుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: