ఏపీలో జిల్లాల విభజన కొంతమందికి బాగా కలిసొచ్చింది. నెల్లూరు జిల్లాను రెండుగా విభజించిన సందర్భంలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాలో కలిసిపోతున్నాయి. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి నియోజకవర్గం మాత్రం నెల్లూరులోనే ఉండిపోయింది. దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి.

 సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోనే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. దానికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఉన్నాయి. ఇక విక్రమ సింహపురి యూనివర్శిటీ కూడా సర్వేపల్లి పరిధిలోనే ఉంటుంది. ఆ నియోజకవర్గం నెల్లూరు చేజారితే.. ఆ జిల్లా పేద జిల్లా అనుకోవాల్సిందే. అంటే సర్వేపల్లి లేని నెల్లూరుని ఊహించుకోలేం. అందుకే సీఎం జగన్ కి ఆ విషయంలో నచ్చజెప్పి మరీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ఆ పని సాధించుకున్నారు. అయితే సర్వేపల్లి నెల్లూరునుంచి విడిపోతే.. అక్కడి స్థానికులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. జిల్లా కేంద్రం బాగా దూరమవుతుంది, అదే సమయంలో సోమశిల నీటి వాడకాల్లో తేడాలొస్తాయి. దీంతో సర్వేపల్లి ప్రజలు తాము నెల్లూరునుంచి విడిపోయేందుకు ఇష్టపడలేదు. చివరకు వారకి అనుకూలంగానే నిర్ణయం వచ్చింది.

 అక్కడితో ఆగితే ఆయన కాకాణి ఎందుకవుతారు. నియోజకవర్గం వ్యాప్తంగా వారోత్సవాలు మొదలు పెట్టారు. ప్రతి ఊరిలోనూ సీఎం జగన్ కి కృతజ్ఞతగా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలలో స్థానికులు కూడా భాగస్వాములవుతున్నారు. మొత్తమ్మీద సర్వేపల్లిలో వారం రోజులపాటు పండగ వాతావరణం నెలకొంది. ఒకరకంగా సర్వేపల్లి వాసులంతా ఎమ్మెల్యే కాకాణికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.

 ప్రస్తుతం నెల్లూరు జిల్లానుంచి కాకాణి మంత్రి పదవి ఆశిస్తున్నారు. జగన్ కొత్త టీమ్ లో ఆయనకు చోటు ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. సీనియార్టీ ప్రకారం ఆయనకు బెర్త్ కన్ఫామ్ అనుకుంటున్నారు. ఈ దశలో జిల్లాల విభజన అంశం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. స్థానికంగా ఆయనకు మరింత మైలేజీ పెరిగింది. దీంతో ఈ హంగామాని కంటిన్యూ చేస్తూ వారోత్సవాల పేరుతో తన నియోజకవర్గంలో భారీ కార్యక్రమాలు చేపట్టారు కాకాణి.

మరింత సమాచారం తెలుసుకోండి: