శివసేన తిరుగుబాటు ఎంఎల్ఏలపై ప్రభుత్వం మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అధికార కూటమి మహా వికాస్ అఘాడీ( ఎంవీఏ)లో శివసేన పెద్దపార్టీ అన్న విషయం తెలిసిందే. ఇపుడా పెద్దపార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉధ్థవ్ థాక్రే వైఖరికి నిసరసగా సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే నాయత్వంలో కొందరు ఎంఎల్ఏలు తిరుగుబాటు లేవదీశారు. షిండే నాయత్వంలో ఎంతమంది ఎంఎల్ఏలున్నారనే విషయం కచ్చితంగా తెలీదు.





ఎందుకంటే షిండే శిబిరంలో నుండి బయటపడిన ఇద్దరు ఎంఎల్ఏలు తమను డిన్నర్ కు ఆహ్వానించి అక్కడినుండి వాహనాల్లో సూరత్ తీసుకెళ్ళిపోయినట్లు చెప్పటం సంచలనంగా మారింది. అంటే శిబిరంలోని ఎంఎల్ఏల్లో అందరినీ డిన్నర్ కు పిలిచి అక్కడినుండి అలాగే సూరత్ కు ఇపుడు గువహతికీ తీసుకెళ్ళిపోయినట్లు అర్ధమవుతోంది. వీరిలో షిండే తిరుగుబాటు ప్లాన్ ఎంతమందికి ముందే తెలుసో తెలీదు. కాబట్టి షిండే శిబిరంలో ఉన్నవారంతా నూరుశాతం తిరుగుబాటు నేత మద్దతుదారులే అనేందుకు లేదు.





సరే విషయం ఏదైనా ఇప్పటికి షిండే నాయకత్వంలో 38 మంది ఎంఎల్ఏలున్నారంటున్నారు. వీరిపైనే ప్రభుత్వం మైండ్ గేమ్ మొదలుపెట్టింది. అదేమిటంటే వీళ్ళ కుటుంబసభ్యులకు ఇచ్చిన భద్రతను ఉపసంహరించేసింది. దాంతో ఇటు కుటుంబసభ్యుల్లోనే కాకుండా అటు ఎంఎల్ఏల్లో కూడా ఆందోళన మొదలైపోయింది. ఇదే సమయంలో ఎంఎల్ఏల ఇళ్ళముందు శివసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు మొదలుపెట్టారు.





ఇది సరిపోదన్నట్లుగా ఎంఎల్ఏల ఆఫీసులు, కుటుంబసభ్యుల ఆఫీసులతో పాటు వాళ్ళ వ్యాపారాలపైన కూడా దాడులు మొదలయ్యాయి. షిండే బలవంతంపైన శిబిరంలో ఉంటున్నవాళ్ళెవరూ ఇపుడు అక్కడ ఉండేందుకు ఇష్టపడరు. ఒకవైపు కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు ఎక్కడో క్యాంపుల్లో ప్రశాంతంగా ఉండలేరు. ఒకరోజు కాకపోయినా మరోరోజు క్యాంపులో నుండి బయటకు రాకతప్పదు. వచ్చి నేరుగా సీఎంను కలిసినపుడు మాత్రమే పరిస్ధితులు చక్కబడతాయి. ఒకసారి షిండే వర్గం నుండి ఎంఎల్ఏలు సీఎంను కలవటం మొదలైతే తర్వాత తిరుగుబాటు నేత దగ్గర ఎంఎల్ఏలు ఎవరూ ఉండరన్నది వాస్తవం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: