కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల ఆన్‌లైన్ తరగతుల విరామం తర్వాత దేశంలోని పాఠశాలలు గత కొంత కాలం క్రితమే తెరుచుకున్నాయి. అయితే.. దీని ప్రభావం ఇంకా పిల్లలను పట్టిపీడిస్తోందని ఉపాధ్యాయులు, మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా తర్వాత పాఠశాలకు వస్తున్న పిల్లలు మానసికంగా దృఢంగా లేరంటున్నారు. నిరాశ, ఆందోళన, భావోద్వేగం వంటి మానసిక సమస్యలతో పాఠశాలకు తిరిగి వస్తున్న పిల్లలు ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా మహమ్మారి కారణంగా ప్రియమైన వారిని కోల్పోయిన విద్యార్థులలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.కరోనా మహమ్మారి పిల్లలు, కౌమారదశలో ఉన్న ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్య పరిణామాలను, పలు సవాళ్లను తీసుకువచ్చింది. దుఃఖం, భయం, అనిశ్చితి, సామాజిక ఒంటరితనం, పెరిగిన స్క్రీన్ సమయం పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. స్నేహాలు, కుటుంబ మద్దతు పిల్లలకు బలమైన శక్తులు. కానీ కరోనా వైరస్ దీనికి అంతరాయం కలిగించిందని UNICEF తెలిపింది.అలాగే యువతలో టెన్షన్ పెరిగిందని.. ఈ ఆందోళనకు చికిత్స చేయకపోతే తీవ్రమైన మానసిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు  చెబుతున్నారు.


మునుపటి అధ్యయనాలు యువతలో డిప్రెషన్, ఇతర మానసిక సమస్యల కేసులు చాలా రెట్లు పెరిగాయని సూచించాయి. ఏకాగ్రత లేకపోవడం పిల్లల జీవితంలో తరువాతి దశలో తలెత్తే సమస్యలకు సంకేతం అంటూ పేర్కొన్నారు.ఇక నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) పాఠశాల పిల్లలలో మానసిక ఆరోగ్య సర్వేను అనుసరించి పాఠశాలకు వెళ్లే పిల్లలు, కౌమారదశలో మానసిక ఆరోగ్య సమస్యలకు ముందస్తు గుర్తింపు, జోక్యం కోసం కొన్ని మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.పాఠశాలలు సాధారణంగా అభ్యాసకులు ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణంలో అభివృద్ధి చెందాలని ఆశించే ప్రదేశాలుగా ఉంటాయి. పాఠశాల నిర్వహణ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు అందరూ రోజులో మూడింట ఒక వంతు సమయాన్ని గడుపుతారు. పాఠశాలలు సంవత్సరానికి దాదాపు 220 రోజులు పనిచేస్తాయి. రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థి ఉండే సమయం మరింత ఎక్కువగా ఉంటుంది. కావున, పాఠశాలలు, హాస్టళ్లలోని పిల్లలందరికీ.. భద్రత, అభ్యసనం, ఆరోగ్యం, ఆహారం, శ్రేయస్సును నిర్ధారించడం ఆ పాఠశాలల బాధ్యత అని NCERT మార్గదర్శకాలను జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: