ఇపుడీ విషయమే సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబునాయుడుకు ఎలాగైనా బెయిల్ ఇప్పించాలని లాయర్లు శతవిధాల పోరాడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును రిమాండుకు తీసుకోవాలని సీఐడీ తరపున అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి పట్టుడలగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే  ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా చాలా పిటీషన్లే దాఖలయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో చంద్రబాబు తరపున ఇంటెరిమ్ బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటీషన్లు వేశారు.
అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంతో పాటు అంగళ్ళు అల్లర్లలో అరెస్టులు చేయకుండా కూడా ముందస్తు బెయిళ్ళు కోసం సుప్రింకోర్టు లాయర్లు పిటీషన్లు వేశారు. ఏసీబీ, హైకోర్టులో పిటీషన్లన్నీ ఒకేరోజు వాదనకు రాబోతున్నాయి. నిజానికి ఏకకాలంలో చంద్రబాబు తరపున ఇన్ని బెయిళ్ళు, ఇంటెరిం బెయిళ్ళు, ముందస్తు బెయిల్ ఫిటీషన్లపై విచారణలంటే అయోమయం పెరిగిపోవటం ఖాయం.
మామూలు జనాలకైతే ఏ కోర్టులో ఏ పిటీషన్ పై లాయర్లు వాదనలు వినిపిస్తారో గుర్తుపెట్టుకోవటం కష్టమే. ఒకేసారి ఇన్ని పిటీషన్లు ఎందుకు వేశారంటే కనీసం ఒక్కదానిలో అయన్నా చంద్రబాబుకు బెయిల్ దొరక్కపోతుందా అని లాయర్ల ఆశ. ఇదే విషయమై రెండున్నరరోజుల పాటు బెయిల్ కోసం శతవిధాల పోరాడి ఓడిపోయిన సిద్దార్ధ లూథ్రా చివరకు చేతెలెత్తేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు.
దాదాపు మూడు పిటీషన్లలో ఒక్కదానిలో అయినా బెయిల్ ఇప్పించాలని లూథ్ర చేసిన ఏ ప్రయత్నమూ సక్సెస్ కాలేదు. మరి తాజాగా సుప్రింకోర్టు నుండి విజయవాడకు చేరుకున్న లాయర్లు ఎవరో చూడాల్సిందే. అన్నీ కేసుల్లోను సీఐడీ తరపున ప్రధానంగా పొన్నవోలు మాత్రమే వాదిస్తున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రిమాండు 22వ తేదీతో ముగుస్తోంది. అందుకనే తమకు ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ బలంగా వాదనలు వినిపించబోతోంది. సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇస్తే కష్టాలు తప్పవు. అందుకనే సీఐడీ కస్టడీని తప్పించేందుకు చంద్రబాబు లాయర్లు తీవ్రమైన పోరాటం చేస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: