సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా రోడ్డుపై తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి తలపు తట్టినా ఒక్కరూ ఆదుకోలేదు. సాయం చేసే మాట అటుంచితే చీదరించుకున్నారు. ఇంకా లోకం తెలియని ఆ 12 ఏళ్ల చిన్నారి ఒంటిని కామాంధులు చేసిన గాయం బాధిస్తుంటే జనం ఛీత్కారాలు ఆ సని మనసుని బాకుల్లా చీల్చాయి. ఉజ్జయిని నగరానికి సమీపంలో ఈ అమానవీయ ఘటనకు వేదికగా మారింది.


వైరల్‌గా మారిన వీడియోలోని దృశ్యాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దిక్కుతోచని ఆ చిన్నారి అలాగే నడుచుకుంటూ వెళ్లి స్పృహ తప్పి పడిపోయింది. ఈ దశలో గుర్తించిన మహాకాల్ ఠాణా పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో బాలికలను ఇందౌర్ కు తరలించి అక్కడి వైద్యుల బృందంలో చికిత్సను నిర్వహిస్తున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నా ప్రమాదం లేదని ఓ అధికారి తెలిపారు.


ఎస్పీ సచిన్ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యపరీక్షలో తేలింది. బాధితురాలు తన వివరాలు స్పష్టంగా చెప్పలేకపోతుంది. మాట తీరు ప్రకారం ఆమెది ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌ రాజ్‌గా భావిస్తున్నాం అని తెలిపారు. ఈ కేసు విచారణకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీఎంసీలు మండిపడ్డాయి.


దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోనీ అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతని ఆటోలో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలు అతని ఆటోలో ఎక్కినట్లు సీసీ టీవీలో నిక్షిప్తమైంది. అతని ఘటాన స్థలానికి తీసుకెళ్లి విచారిస్తుండగా పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే అతడిని నిర్బందించారు. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో 13 ఏళ్ల తమ పాప స్కూల్ యూనిఫాంలో అదృశ్యమైందని ఒక ఫిర్యాదు దాఖలైంది. ఆ పాపే ఈ పాప అని పోలీసులు తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: