ఏపీలో ఎన్నికలకు ఇంకా నెలరోజులు మాత్రమే సమయం వుంది. కాగా ఈ గ్యాప్ లో అటు అధికార వైసిపి పార్టీకి, ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి రకరకాల ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడికి చుక్కెదురైంది. అవును, రాయలసీమలో ఈసారి ఎలాగున్నా తమ ఉనికిని చాటుకోవాలనుకొని కలలు గన్న బాబుగారికి మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఝలక్కినిచ్చే పనిలో పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో ఆయన టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారని సమాచారం. చంద్రబాబుపై అసంతృప్తితోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

విషయం ఏమిటంటే, టికెట్ల కేటాయింపులో తనకు తీరని అన్యాయం జరిగినట్టు కేఈ ప్రభాకర్ తాజాగా ఓ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన గతంలో కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఈసారి డోన్, పత్తికొండ నియోజక వర్గాల్లో తనకు ఎక్కడైనా చోటు కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబు డోన్ స్థానంలో కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి పేరును ఖారారు చేశారు. దాంతో ప్రభాకర్‌ తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదేవిధంగా పత్తికొండ సీటును కూడా సోదరుడు కేఈ కృష్ణమూర్తి కుమారుడుకు కేటాయించడంతో కేఈ ప్రభాకర్‌కు చుక్కలు కనబడ్డాయి. దాంతోనే పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీని వీడాలని డిసైడ్ అయ్యారు.

దీనిలో భాగంగానే తన అనుచరులైన వారితో భేటీ అయి, తరువాత రాజకీయ భవిష్యత్తు గురించి వారితో చర్చించారు. ఈక్రమంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలతో కేఈ ప్రభాకర్ మంతనాలు జరిపినట్టు సమాచారం. వైసీపీలో స్పష్టమైన హామీ దక్కడంతోనే కేఈ ప్రభాకర్‌ టీడీపీకి రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదేగాని జరిగితే కేఈ ప్రభాకర్‌ను కర్నూల్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా కేఈ ప్రభాకర్‌ సోదరుడు కేఈ కృష్ణమూర్తి చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు ఆయన తమ్ముడు కేఈ ప్రభాకర్‌ టీడీపీని వీడితే ఆ ప్రభావం ఖచ్చితంగా జిల్లా మొత్తం మీద పడుతుందని పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: